Delhi: బైక్‌ దొంగల వెనుక ఉగ్ర నెట్‌వర్క్‌.. ఆ టెర్రరిస్టులందరూ ఇంజినీర్లే..!

దిల్లీలో అరెస్టు చేసిన ఐసిస్‌ ఉగ్రవాది షానవాజ్‌ను తొలుత పోలీసులు ఓ బైక్‌ దొంగతనం యత్నంలో అరెస్టు చేశారు. ఆ విచారణ సమయంలో అతడి వెనుక ఉన్న భారీ ఉగ్ర నెట్‌వర్క్‌ బయటపడింది. అంతేకాదు.. మైనింగ్‌ ఇంజినీర్‌గా పేలుళ్లపై ఉన్న పరిజ్ఞానాన్ని జోడించి దేశ వ్యాప్తంగా బ్లాస్ట్‌లకు అతడు కుట్ర పన్నినట్లు అధికారులు చెబుతున్నారు.

Published : 03 Oct 2023 12:06 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్‌ల్లో నిన్న జాతీయ దర్యాప్తు సంస్థ అదుపులోకి తీసుకొన్న ఐసిస్‌ ఉగ్రవాదులందరూ ఉన్నత విద్యావంతులే. ఈ విషయాన్ని దిల్లీ పోలీస్‌ స్పెషల్‌ సెల్‌ సీనియర్‌ అధికారి హెచ్‌జీఎస్‌ దాలివాల్‌ వెల్లడించారు. వీరిలో కీలక నిందితుడైన షానవాజ్‌, అతడి అనుచరులు రిజ్వాన్‌ అష్రాఫ్‌, మొహమ్మద్‌ అర్షద్‌ వార్సి ఇప్పటికే దేశవ్యాప్తంగా రెక్కీలు నిర్వహించినట్లు కూడా వెల్లడించారు.

మైనింగ్‌ రంగంలో అనుభవంతో ఉగ్రవాదం..

ప్రధాన నిందితుడు షానవాజ్‌ ఝార్ఖండ్‌లోని హజారీబాగ్‌ ప్రాంతానికి చెందినవాడు. అతడు మైనింగ్‌లో ఇంజినీరింగ్‌ పూర్తి చేశాడు. ఇంజినీరింగ్‌ బ్లాస్ట్‌లపై అతడికి మంచి అనుభవం ఉంది. అతడు మతాంతర వివాహాం చేసుకొన్నాడు. ప్రస్తుతం అతడి భార్య కూడా పరారీలో ఉంది.

ఈ కేసులో మరో నిందితుడు మహమ్మద్‌ అర్షద్‌ వార్సి కూడా ఝార్ఖండ్‌కు చెందిన వాడే. ఇతడు అలీగఢ్ యూనివర్సిటీలో మెకానికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తిచేశాడు. ప్రస్తుతం దిల్లీలోని జామియా మిలియాలో పీహెచ్‌డీ చేస్తున్నాడు.

మూడో నిందితుడైన రిజ్వాన్‌ కంప్యూటర్‌ సైన్స్‌లో బీటెక్‌ పూర్తి చేశాడు. ఇతడిది ఉత్తరప్రదేశ్‌లోని ఆజమ్‌గఢ్‌. ఇతడు మతగురువుగా శిక్షణ పొందాడు. ఈ అరెస్టులపై దిల్లీ పోలీసుశాఖకు చెందిన దాలివాల్‌ మాట్లాడుతూ.. ‘‘దేశవ్యాప్తంగా పాపులర్‌ వ్యక్తులను చంపేలా, అత్యధిక మంది మరణించేలా పేలుళ్లు జరపాలనే లక్ష్యంతో పనిచేస్తున్న ఐసిస్‌ మాడ్యుల్‌ను ఛేదించేందుకు ప్రస్తుత దాడులు జరుగుతున్నాయి’’ అని వెల్లడించారు.

నిత్యం ఐసిస్‌ హ్యండ్లర్‌తో టచ్‌లో..

నిన్న అరెస్టు చేసిన నిందితుల వద్ద నుంచి ఓ తుపాకీని కూడా స్వాధీనం చేసుకొన్నట్లు తెలిపారు. షానవాజ్‌ దిల్లీ స్థావరం నుంచి జిహాద్‌కు సంబంధించిన పుస్తకాలు, రసాయనాలు వంటివి స్వాధీనం చేసుకొన్నామన్నారు. ఇతడు విదేశాల్లోని తన ఐసిస్‌ హ్యాండ్లర్‌కు నిత్యం సమాచారం పంపేవాడని పోలీసులు చెప్పారు.

బైక్‌ దొంగతనానికి యత్నించి దొరికిపోయి..

షానవాజ్‌ను పోలీసులు తొలిసారి నాటకీయ ఫక్కీలో పట్టుకొన్నారు. అతడు మహమ్మద్‌ ఇమ్రాన్‌ మహమ్మద్‌ యూనిస్‌, మహమ్మద్‌ యాకూబ్‌ షేక్‌ అనే మరో ఇద్దరితో కలిసి పుణేలో ఓ బైక్‌ దొంగతనానికి యత్నించాడు. ఈ కేసులో అక్కడి పోలీసులు జులైలో వారిని అరెస్టు చేశారు. అనంతరం పోలీసులు వారి ఇళ్లల్లో సోదాలు చేసేందుకు నిందితులను తీసుకెళ్లిన సమయంలో షానవాజ్ పోలీస్‌ వ్యాన్‌ దూకి పారిపోయాడు. ఆ సమయంలో వీరి ఇళ్ల నుంచి బాంబుల తయారీకి వాడే పదార్థాలు, బ్యాటరీలు, టైమర్లు, బల్బులు, షోల్డరింగ్‌ గన్‌లు స్వాధీనం చేసుకొన్నారు. ఈ వ్యవహారం చూసి పోలీసులు ఒక్కసారిగా అప్రమత్తమైపోయారు. విచారణలో యూనిస్‌, యాకూబ్‌ మధ్యప్రదేశ్‌కు చెందినవారిగా తెలిసింది. మార్చిలో రాజస్థాన్‌లో దొరికిన కారుబాంబు కేసులో వీరి హస్తం ఉన్నట్లు గుర్తించారు.

కెనడాకు భారత్ అల్టిమేటం.. అక్టోబరు 10లోగా దౌత్యసిబ్బందిని తగ్గించుకోవాలని డెడ్‌లైన్..!

షానవాజ్‌ బోప్తాఘాట్‌ అనే ప్రదేశంలో యాసిడ్‌ దాచినట్లు గుర్తించి.. పోలీసులు అక్కడ దాడులు నిర్వహించారు. వీరికి మరోసారి భారీగా రసాయనాలు దొరికాయి. దీంతోపాటు దాదాపు 500 జీబీ డేటాను కూడా స్వాధీనం చేసుకొన్నారు. వీటిల్లో బాంబుల తయారీ వీడియోలు, దేశంలోని వివిధ ప్రాంతాల ఫొటోలు ఉన్నాయి. షానవాజ్‌ ఇప్పటికే కొల్హాపుర్‌, సంగ్లీ, సతారా ప్రాంతాలకు బృందాలను పంపించి రెక్కీలు నిర్వహించినట్లు తేలింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని