e-Visa For Afghans: అఫ్గాన్‌ పౌరులు ఈ-వీసాలతోనే భారత్‌కు రావాలి..!

Afghan Crisis: అఫ్గానిస్థాన్‌లో పరిస్థితులు నానాటికీ క్షీణిస్తున్న నేపథ్యంలో ఆ దేశస్థులు ఇకపై కేవలం ఈ-వీసాల (e-Visa)తో భారత్‌కు రావాలని కేంద్ర హోంశాఖ వెల్లడించింది.

Published : 25 Aug 2021 18:19 IST

స్పష్టం చేసిన కేంద్ర హోంశాఖ

దిల్లీ: అఫ్గానిస్థాన్‌ (Afghanistan)లో పరిస్థితులు నానాటికీ క్షీణిస్తున్న నేపథ్యంలో ఆ దేశ పౌరుల భారత ప్రయాణాలపై కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. అఫ్గాన్‌ దేశస్థులు ఇకపై కేవలం ఈ-వీసాల (e-Visa)తో భారత్‌కు రావాలని వెల్లడించింది. ఈ మేరకు బుధవారం ప్రకటన విడుదల చేసింది. 

‘‘భద్రతా పరంగా అఫ్గాన్‌లో పరిస్థితులు క్షీణిస్తుండటం, e-Emergency X-Misc వీసాలను ప్రవేశపెట్టడం ద్వారా వీసా ప్రక్రియను క్రమబద్దీకరిస్తుండటంతో ఇక నుంచి అఫ్గాన్‌ పౌరులు (Afghan people) కేవలం ఈ-వీసాలతోనే భారత్‌కు రావాలని నిర్ణయించాం’’ అని హోంశాఖ వెల్లడించింది. అంతేగాక, ఇప్పుడు భారత్‌లోని అఫ్గాన్‌ దేశస్థులకు గతంలో జారీ చేసిన వీసాలు ఇకపై చెల్లుబాటు కావని స్పష్టం చేసింది. ఆ దేశ పౌరులు ఇప్పుడు భారత్‌కు రావాలనుకుంటే తప్పనిసరిగా ఈ-వీసాల కోసం దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. అఫ్గాన్‌లో భారత దౌత్య కార్యాలయాలు మూసివేసినందున వీసా దరఖాస్తులను దిల్లీలో పరిశీలించనున్నట్లు అధికారులు తెలిపారు.

తాలిబన్ల (Talibans) ఆక్రమణలతో అఫ్గాన్‌లో కల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. ముష్కరుల అరాచక పాలన నుంచి తప్పించుకునేందుకు చాలా మంది ఆ దేశ పౌరులు కాబుల్‌ (kabul) విమానాశ్రయానికి పోటెత్తారు. మరోవైపు అఫ్గాన్‌లో చిక్కుకుపోయిన భారతీయుల తరలింపు కోసం భారత్‌ ప్రత్యేక విమానాలు నడుపుతోంది. భారతీయులతో పాటు అఫ్గాన్‌ సిక్కులు, హిందువులను కూడా మానవతా దృక్పథంతో ఇక్కడకు తీసుకొస్తోంది. ఇందులో భాగంగానే వారి కోసం ఈ-ఎమర్జెన్సీ వీసా (e- emergency visa) విధానాన్ని ప్రవేశపెట్టింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని