Odisha Train Tragedy: ఒడిశా రైలు దుర్ఘటన.. ఏ క్షణంలో ఏం జరిగింది?

ఒడిశా రైలు దుర్ఘటన మాటలకందని విషాదాన్ని నింపింది. శుక్రవారం రాత్రి చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో ఏ సమయానికి ఏం జరిగిందంటే.. 

Updated : 03 Jun 2023 22:32 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఒడిశా రైలు దుర్ఘటనలో (Odisha Train Tragedy) మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటివరకు 288 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. మరో 56 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. శుక్రవారం రాత్రి రైలు ప్రమాదం జరిగిన సమయంలో ఏ క్షణం ఏం జరిగిందనేది అధికారులు ఆరా తీశారు. వాటి వివరాలిలా..

శుక్రవారం రాత్రి.. ఎప్పుడేం జరిగింది?

  • 6.50: లూప్‌ లైన్‌లో నిలిపి ఉంచిన గూడ్స్‌ రైలును కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ బలంగా ఢీ కొట్టడంతో అందులోని ప్రయాణికులకు భారీ శబ్ధం వినిపించింది. రైలు బోగీలు పట్టాలు తప్పి.. చెల్లాచెదురుగా పడిపోయాయి.
  • 6.55: పట్టాలు తప్పిన కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ బోగీలు పక్క ట్రాక్‌పై పడ్డాయి. దీంతో అటువైపుగా వస్తున్న బెంగళూరు-హవ్‌డా సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ చివరి బోగీలను ఢీ కొట్టింది.
  • 7.10: విషయం తెలిసిన స్థానికులు సంఘటన స్థలికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు.
  • 7.30: స్థానిక అధికారులు, పోలీసులు, అత్యవసర సహాయ సిబ్బంది ప్రమాదం జరిగిన చోటుకి చేరుకున్నారు.
  • 8.00 - 9:00: బీఆర్‌ సింగ్ ఆస్పత్రి నుంచి పెద్ద సంఖ్యలో వైద్యులు, నర్సులు, పారామెడికల్‌ సిబ్బంది, ఆర్థోపెడిక్‌, ఈస్ట్రన్‌ రైల్వే ఆస్పత్రి సిబ్బంది సంఘటన స్థలికి చేరుకొని సహాయక చర్యలు ముమ్మరం చేశారు.
  • 9.30: స్వల్ప గాయాలైన వారిని సమీప ఆస్పత్రులకు తరలించేందుకు డివిజనల్‌ మేనేజర్‌ బస్సులను ఏర్పాటు చేశారు.
  • 9.59 : ముంబయి-గోవా వందేభారత్‌ రైలు ప్రారంభోత్సవాన్ని రద్దు చేస్తున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది.

* శనివారం ఉదయమే రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఘటనపై దర్యాప్తు చేసేందుకు అత్యున్నత స్థాయి కమిటీని వేస్తున్నట్లు  తెలిపారు. ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ కూడా సంఘటన స్థలికి వెళ్లారు. ఆ తర్వాత పలువురు కేంద్ర మంత్రులు ఘటనా స్థలికి వెళ్లి పరిస్థితులు గమనించారు. సాయంత్రం ప్రధాని మోదీ సంఘటన స్థలాన్ని పరిశీలించి.. కటక్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. కారకులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు