Gujarat Tragedy: ప్రధాని రాకవేళ ఆసుపత్రికి హంగులు..విపక్షాల విమర్శలు

గుజరాత్‌లో మోర్బీ ఘటనా స్థలానికి ప్రధాని మోదీ రానున్నవేళ.. అక్కడి ఆసుపత్రికి మెరుగులు దిద్దుతున్న దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి.

Published : 01 Nov 2022 12:11 IST

మోర్బీ: గుజరాత్‌ తీగల వంతెన దుర్ఘటన నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ మోర్బీలోని ప్రమాద స్థలానికి వెళ్లనున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించనున్నారు. ఈ నేపథ్యంలో మోర్బీలోని ప్రభుత్వ ఆసుపత్రిలోని లోపాలను సరిచేయడం, మెరుగులు దిద్దడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. దీనిపై కాంగ్రెస్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీలు విరుచుకుపడ్డాయి.

ప్రధాని రాకకు కొద్ది గంటల ముందు మోర్బీ ఆసుపత్రిలో అర్ధరాత్రి  తర్వాత మరమ్మతు పనులు చేస్తోన్న దృశ్యాలను విపక్ష పార్టీలు షేర్‌ చేశాయి. ‘సుమారు 134 మంది మృతి చెందారు. పలువురు గల్లంతయ్యారు. ఈ ఘటన కారకులపై ఇంతవరకు ఎలాంటి చర్యలు లేవు. కానీ భాజపా కార్యకర్తలు మాత్రం ఫొటోషూట్ కోసం ఆసుపత్రిని సిద్ధం చేస్తున్నారు’ అని ఆప్‌ దుయ్యబట్టింది. ‘ఆసుపత్రికి కొత్తగా రంగులేస్తున్నారు. టైల్స్ మారుస్తున్నారు. వారికి సిగ్గుగా అనిపించడం లేదా..? ఇక్కడ ఎంతో మంది దుర్మరణం పాలైతే.. వారు మాత్రం ఒక ఈవెంట్‌ కోసం సిద్ధమవుతున్నారు’ అని కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ‘భాజపాకు ఈవెంట్ మేనేజ్‌మెంట్ మాత్రమే తెలుసు. గుజరాత్‌కు భాజపా ఒక విపత్తులా పరిణమించింది. ఈ అలంకరణకు బదులుగా బాధితులకు తగిన చికిత్స అందేలా చూడాలి’ అని విపక్ష పార్టీలు మండిపడ్డాయి. 

ఇదిలా ఉంటే.. గుజరాత్‌ దుర్ఘటనలో ఇప్పటివరకూ 134 మంది దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటనపై ప్రధాని నరేంద్రమోదీ ఉద్వేగానికి గురయ్యారు. ప్రమాదం గురించి తెలియగానే తన హృదయం తల్లడిల్లిందన్నారు. జీవితంలో ఇలాంటి బాధను అనుభవించిన సందర్భాలు తక్కువ అంటూ విచారం వ్యక్తం చేశారు.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని