Parliament: బడ్జెట్‌ సమావేశల్లో.. అదానీ, కులగణనపై చర్చకు విపక్షాల పట్టు..!

బడ్జెట్‌ సమావేశాల (Budget 2023) నేపథ్యంలో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించిన కేంద్ర ప్రభుత్వం.. సభా కార్యకలాపాలు సాఫీగా సాగేందుకు సహకరించాలని అన్ని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేసింది. ఈ భేటీకి (All Party Meet) హాజరైన విపక్ష పార్టీలు.. అదానీ, కులగణన, చైనా దురాక్రమణ వంటి అంశాలను ఈ సమావేశాల్లో చర్చించాలనే డిమాండును ప్రభుత్వం ముందు ఉంచాయి.

Published : 30 Jan 2023 17:05 IST

దిల్లీ: కేంద్ర బడ్జెట్‌ (Budget 2023) సమావేశాలు జనవరి 31 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో నిబంధనలకు లోబడి ఏ అంశంపైనైనా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ క్రమంలో సభా కార్యకలాపాలు సాఫీగా సాగేందుకు విపక్ష పార్టీలు సహకరించాలని పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి విజ్ఞప్తి చేశారు. బడ్జెట్‌ సమావేశాల నేపథ్యంలో సోమవారం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి (All Party Meet) 27 పార్టీల నుంచి 37 మంది నేతలు హాజరైనట్లు వెల్లడించారు.

అఖిలపక్ష భేటీలో ఆమ్‌ ఆద్మీ పార్టీ తరఫున సంజయ్‌ సింగ్‌, ఆర్జేడీ తరఫున మనోజ్‌ ఝా, డీఎంకే, లెఫ్ట్‌ పార్టీల నేతలు.. అదానీ వ్యవహారంపై ఈ సమావేశాల్లో చర్చ జరపాలని డిమాండ్‌ చేశారు. ఇక దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేసింది. దేశ జనాభాలో 50శాతానికిపైగా వెనుకబడిన కులాల వారు ఉన్నారని.. కులగణన చేపడితే వారి ఆర్థికస్థితి తెలుస్తుందని అభిప్రాయపడింది. మహిళా రిజర్వేషన్‌లకు సంబంధించిన బిల్లును ఆమోదింపజేయడమే ప్రధాన లక్ష్యమని బీజేడీ పేర్కొంది. ఇందుకు భారాస, టీఎంసీలూ మద్దతు పలికినట్లు తెలిపింది. మరోవైపు చైనా దురాక్రమణకు సంబంధించిన అంశాన్ని బహుజన్‌ సమాజ్‌పార్టీ లేవనెత్తింది. దీనిపై స్పందించిన ప్రభుత్వం.. భద్రతా కారణాల దృష్ట్యా చైనా అంశాన్ని పార్లమెంటులో చర్చించలేమని స్పష్టం చేసింది.

బడ్జెట్‌ సమావేశాలు జనవరి 31నుంచి ప్రారంభం కానుండగా.. తొలిరోజు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగం చేస్తారు. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. ఏప్రిల్‌ 6వ తేదీ వరకు రెండు విడతల్లో సమావేశాలు నిర్వహించనున్నారు. తొలి విడత ఫిబ్రవరి 14 వరకు జరుగుతుంది. అనంతరం రెండో విడత మార్చి 12 నుంచి మొదలై ఏప్రిల్‌ 6వరకు మొత్తం 27 పనిరోజుల్లో సభా కార్యకలాపాలు కొనసాగుతాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని