Parliament: పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల నేపథ్యంలో అఖిలపక్ష భేటీ

పార్లమెంటు శీతాకాల సమావేశాలు(Parliament Winter Session) బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో అఖిలపక్ష సమావేశాన్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

Published : 06 Dec 2022 13:52 IST

దిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాలు (Winter Session) డిసెంబర్‌ 7నుంచి మొదలుకానున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం (All Party Meet) ఏర్పాటు చేసింది. పార్లమెంట్‌ లైబ్రరీ భవన్‌లో ఈ ఉదయం 11గంటలకు సమావేశం ప్రారంభమైంది. రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి, కాంగ్రెస్‌ నేత అధీర్‌ రంజన్‌ చౌధురి, తృణమూల్‌ నేత డెరెక్‌ ఒబ్రెయిన్‌, డీఎంకే ఎంపీ టీఆర్‌ బాలుతోపాటు ఇతర పార్టీ నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. డిసెంబర్‌ 29వరకు జరగనున్న ఈ సమావేశాల్లో కొత్త బిల్లులు, చర్చకు వచ్చే అంశాలపై అన్ని పార్టీలకు వివరించనుంది. అంతేకాకుండా సమావేశాలు సజావుగా సాగేలా విపక్ష పార్టీలు సహకరించాలని ప్రభుత్వం కోరనుంది. ఇదే సమయంలో తాము లేవనెత్తే అంశాలనూ ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వం ముందు ప్రస్తావించనున్నాయి.

ఈ శీతాకాల సమావేశాల్లో (Parliament Session) మొత్తం 17 రోజుల పాటు కార్యకలాపాలు కొనసాగనున్నాయి. ఈ సందర్భంగా ప్రభుత్వం కొత్తగా 16 బిల్లులను ప్రవేశ పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది. రాజ్యాంగ సంస్థలను మోదీ ప్రభుత్వం బలహీనం చేస్తోందని ఆరోపిస్తోన్న కాంగ్రెస్‌.. దేశ ఆర్థిక పరిస్థితి, ధరల పెరుగుదల, చైనా సరిహద్దులో ప్రతిష్టంభన వంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్ధమవుతోంది. భారత్‌ జోడో యాత్రలో ఉన్నందున ఈ సమావేశాలకు కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ హాజరు కాకపోవచ్చని తెలుస్తోంది. అయితే, పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యే మరుసటి రోజే గుజరాత్, హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ ఫలితాల తీరును ఆయా పార్టీలు పార్లమెంటు సమావేశాల్లో ప్రస్తావించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ప్రస్తుతమున్న భవనంలో ఈ శీతాకాల సమావేశాలే చివరివి కానున్నాయి. తదుపరి సమావేశాలు పార్లమెంటు కొత్త భవనంలో జరిపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని