ఆకాశాన అతివల రికార్డు 

గగనతలంలో భారత మహిళా పైలట్లు చరిత్ర సృష్టించనున్నారు.  ఉత్తర ధ్రువం మీదుగా తొలి సుదూర విమానాన్ని మొత్తం మహిళలే నడపనున్నారు. శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి ఎక్కడా ఆగకుండా అట్లాంటిక్‌ను

Published : 09 Jan 2021 17:28 IST

తొలి సుదూర విమానాన్ని నడపనున్న మహిళా పైలట్లు

దిల్లీ: గగనతలంలో భారత మహిళా పైలట్లు చరిత్ర సృష్టించనున్నారు.  ఉత్తర ధ్రువం మీదుగా తొలి సుదూర విమానాన్ని మొత్తం మహిళలే నడపనున్నారు. శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి ఎక్కడా ఆగకుండా అట్లాంటిక్‌ను దాటుకుంటూ ఈ విమానాన్ని బెంగళూరుకు తీసుకురానున్నారు. 

శాన్‌ఫ్రాన్సిస్కో, బెంగళూరు మధ్య గాలి వేగాన్ని బట్టి ప్రయాణ సమయం 17 గంటల పైనే ఉంటుంది. ప్రపంచంలోనే ఎయిరిండియా లేదా ఏ ఇతర దేశీయ విమానయాన సంస్థ గానీ నడుపుతున్న అత్యంత సుదూరు వాణిజ్య విమానం ఇదే కానుందని ఎయిరిండియా ఓ ప్రకటనలో తెలిపింది. ఈ రెండు నగరాలు భూమికి ఇరు కొనల్లో ఉంటాయి. వీటి మధ్య దూరం 13,993 కిలోమీటర్లు కాగా.. టైంజోన్‌ తేడా 13.5 గంటలు ఉంటుంది. అమెరికా కాలమానం ప్రకారం ఈ విమానం శనివారం రాత్రి 8.30 గంటలకు శాన్‌ఫ్రాన్సిస్కోలో బయల్దేరి.. సోమవారం తెల్లవారుజామున(భారత కాలమానం ప్రకారం) 3.45 గంటలకు బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగుతుంది. 

ఈ తొలి సుదూర విమానంలో కాక్‌పిట్‌లో ఉండేవారంతా మహిళలే కావడం విశేషం. ఈ విషయాన్ని కేంద్ర పౌరవిమానయాన మంత్రి హరదీప్‌ సింగ్‌ పురి ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. కెప్టెన్ జోయా అగర్వాల్‌, కెప్టెన్‌ పాపగారి తన్మయి, కెప్టెన్‌ ఆకాంక్ష సోనావర్‌, కెప్టెన్‌ శివానీ మనహ్యాస్‌ విమానాన్ని ఆపరేట్‌ చేయనున్నట్లు తెలిపారు. ‘ఎయిరిండియా మహిళా శక్తి ప్రపంచవ్యాప్తంగా మరింత ఎత్తుకు చేరుకుంది’ అని పురి ప్రశంసించారు. 

బోయింగ్‌ 777తో నడిపే ఈ విమానంలో 238 సీట్ల సామర్థ్యం ఉంది. ఇందులో 8 ఫస్ట్‌ క్లాస్‌, 35 బిజినెస్‌ క్లాస్‌, 195 ఎకనమిక్‌ క్లాస్‌ సీట్లు. వీటితో పాటు నలుగురు కాక్‌పిట్‌ సిబ్బంది, 12 మంది క్యాబిన్‌ సిబ్బంది ఉండనున్నట్లు ఎయిరిండియా వెల్లడించింది.

ఇవీ చదవండి..

నిద్రాణ దశను వీడిన చాంగే-4

భారత్‌ భూభాగంలోకి చైనా జవాన్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని