Hemant Soren: నేను ముఖ్యమంత్రిని.. పారిపోతానా..?

 మైనింగ్ లీజుల వ్యవహారంలో సోరెన్‌పై అనర్హత వేటు వేయాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి భాజపా కొద్దినెలల క్రితమే ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఈ కేసులో ఈడీ విచారణకు వెళ్లేముందు ఆయన మద్దతుదారులతో మాట్లాడారు. 

Updated : 17 Nov 2022 15:21 IST

రాంచి: గత కొద్ది నెలలుగా ఝార్ఘండ్ రాజకీయాల్లో సందిగ్ధ వాతావరణం నెలకొంది. ముఖ్యమంత్రి అనర్హత వేటు వార్తలు, మైనింగ్ లీజులకు సంబంధించి మనీలాండరింగ్ కేసులో ముఖ్యమంత్రికి ఈడీ సమన్లు జారీ చేయడం వంటి కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ కేసులో నేడు సీఎం సోరెన్‌ ఈడీ విచారణకు హాజరయ్యారు. దానికి ముందు ఆయన తన ఇంటి వద్ద మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడారు.

‘నేను ఒక రాజ్యాంగ పదవిలో ఉన్నాను. నేను దేశం వదిలిపారిపోతాననే రీతిలో ఈడీ దర్యాప్తు చేస్తోంది. సమన్లు జారీ చేస్తోంది. బడా వ్యాపారవేత్తలు మినహా మిగతా ఎవరూ  దేశం విడిచిపారిపోయినట్లు నాకు గుర్తులేదు. ఏ ఒక్క రాజకీయ నాయకుడు అలా వెళ్లలేదు. 2019లో ఇక్కడ సంకీర్ణ ప్రభుత్వం(జేఎంఎం-కాంగ్రెస్) ఏర్పడిన దగ్గరి నుంచి నన్ను గద్దె దించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంతకాలం కుట్రదారులు ఒక జలాంతర్గామి (బయటకు కనిపించకుండా నీటిలోపల ఉంటుంది) వలే వ్యవహరించారు. బయటకు రావడానికి భయపడ్డారు. కానీ, ఇప్పుడు బయటపడుతున్నారు. ఇదంతా పెద్ద కుట్రలో భాగం’ అంటూ హేమంత్‌ సోరెన్ విరుచుకుపడ్డారు.

అక్రమ మైనింగ్‌ కేసుకు సంబంధించి చేసిన దాడుల్లో ఇప్పటివరకు వెయ్యికోట్ల రూపాయలను గుర్తించినట్లు ఈడీ వెల్లడించింది. దీనిని సోరెన్ తోసిపుచ్చారు. ‘వెయ్యి కోట్ల రూపాయల మేర అవకతవకలకు పాల్పడాలంటే.. లీగల్‌ మైనింగ్ అంతకు నాలుగురెట్లు ఉండాలి. ఆ మైనింగ్ చేసిన సరుకును తరలించాలంటే 20వేల రైల్వే రేక్స్ అవసరం. అంటే 33 లక్షల ట్రక్కులు. సరైన పత్రాలు లేకుండా రైల్వే దీనిని రవాణా చేస్తుందా..? ఆరోపణలు చేసేముందు ఈ వాస్తవాలను పరిగణనలోకి తీసుకోలేదనుకుంటా’ అని తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు. మద్దతుదారులతో మాట్లాడిన అనంతరం ఆయన ఈడీ కార్యాలయానికి బయలుదేరారు. 

ఈ మైనింగ్ లీజుల వ్యవహారంలో సోరెన్‌పై అనర్హత వేటు వేయాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి భాజపా కొద్దినెలల క్రితమే ఫిర్యాదు చేసింది. దీనిపై ఈసీ తన నిర్ణయాన్ని ఆగస్టు 25న గవర్నర్‌కు పంపించింది. దాంతో సోరెన్ సభ్యత్వంపై వేటు పడుతుందని కొద్దినెలలుగా వార్తలు వస్తున్నాయి. అయితే, దానిపై ఇంతవరకూ నిర్ణయం వెలువడలేదు. ఇంతకుముందు కూడా ఈడీ సమన్లు జారీ చేయగా.. ఆయన విచారణకు గైర్హాజరయ్యారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని