Indian Railways: కరోనా కాలంలో ‘ప్రత్యేక’ రైలు సర్వీసులతో.. ఏడాదిలో రూ.17వేల కోట్ల ఆదాయం

భారతీయ రైల్వేకు 2021-22 సంవత్సరంలో ప్రత్యేక సర్వీసులతోనే రూ.17,526 కోట్ల ఆదాయం వచ్చినట్లు తేలింది.

Published : 17 Oct 2022 01:26 IST

దిల్లీ: ప్రయాణికుల డిమాండు దృష్ట్యా నడిపే ప్రత్యేక సర్వీసులతో భారతీయ రైల్వే (Indian Railways) భారీ ఆదాయాన్ని పొందుతోంది. 2021-22 సంవత్సరంలో ఇలా ప్రత్యేక సర్వీసులతో (Special Trains) రూ.17,526 కోట్లను ఆర్జించినట్లు తేలింది. ఇది ఆ ఏడాది ప్రయాణికుల టికెట్ల విక్రయం ద్వారా మొత్తం పొందిన ఆదాయంలో సుమారు 45శాతం కావడం గమనార్హం.

మహమ్మారి విజృంభణకు ముందు 2019-2020 ఏడాదిలో ప్రత్యేక సర్వీసుల ద్వారా రూ.804.78కోట్ల ఆదాయం వచ్చినట్లు భారతీయ రైల్వే తెలిపింది. 2020-21లో మాత్రం ఈ ఆదాయం రూ.1202కోట్లకు చేరుకోగా. 2021-2022లో అత్యధికంగా రూ.17,526కోట్లు వచ్చినట్లు వెల్లడించింది. ఇది ఆ ఏడాది ప్యాసింజర్‌ రెవెన్యూ ద్వారా వచ్చిన మొత్తం ఆదాయంలో 45శాతమని భారతీయ రైల్వే వెల్లడించింది.

ప్యాసింజర్‌ రైళ్ల టికెట్లతో 2019-2020లో భారతీయ రైల్వే మొత్తం రూ.50,669కోట్ల ఆదాయం పొందగా.. తదుపరి ఏడాది (2020-21లో) రూ.15,248 కోట్లకు పడిపోయింది. ఆ సమయంలో ఎక్కువగా ప్రత్యేక రైలు సర్వీసులను మాత్రమే నడిపించారు. దీంతో ఆ ఏడాది ఆదాయం మళ్లీ పెరిగింది. 2021-22 వచ్చేసరికి ప్యాసింజర్‌ రైళ్లు పెరగడం.. తొలి త్రైమాసికంలో రూ.4921 కోట్లు, రెండో త్రైమాసికంలో రూ.10,513 కోట్లు, మూడో త్రైమాసికంలో రూ.11,873కోట్ల ఆదాయం సమకూరింది. చివరి త్రైమాసికంలో రూ.11,796 కోట్ల ఆదాయం రావడంతో ఆ ఏడాది మొత్తంగా ప్రయాణికుల నుంచి రూ.39,104కోట్ల ఆర్జించినట్లయ్యింది. ఇందులో సుమారు 45శాతం కేవలం  ప్రత్యేక రైలు సర్వీసుల నుండే పొందింది.

పండుగలు, జాతీయ స్థాయి పరీక్షలు వంటి ప్రత్యేక సందర్భాల్లో నడిపే స్పెషల్‌ రైళ్లలో టికెట్‌ ధర కూడా అధికంగా ఉంటుంది. ఇలా కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభణ సమయంలో భారతీయ రైల్వే ఇటువంటి స్పెషల్‌ సర్వీసులను మాత్రమే నడిపింది. ఈ నేపథ్యంలో వీటి ద్వారా మొత్తం ఎంత ఆదాయం సమకూరిందనే విషయాన్ని తెలపాలని చంద్రశేఖర్‌ గౌర్‌ అనే వ్యక్తి సమాచారహక్కు చట్టం కింద రైల్వేశాఖకు దరఖాస్తు చేశారు. దానికి బదులుగా భారతీయ రైల్వే ఈ వివరాలు వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని