
Amar Jawan Jyoti: అమర్ జవాన్ జ్యోతిని ఆర్పివేయట్లేదు.. కేంద్రం స్పష్టత
దిల్లీ: 50 ఏళ్లుగా నిర్విరామంగా వెలుగుతున్న అమర్ జవాన్ జ్యోతిని నేడు ఆర్పివేయనున్నట్లు వచ్చిన వార్తలపై కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. జ్యోతిని పూర్తిగా ఆర్పివేయట్లేదని, అందులో కొంత భాగాన్ని తీసుకెళ్లి జాతీయ యుద్ధ స్మారకం వద్ద ఉండే జ్యోతితో కలపనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ మధ్యాహ్నం 3.30 గంటలకు ఈ కార్యక్రమం జరగనున్నట్లు పేర్కొన్నాయి.
దేశ రాజధానిలోని ఇండియా గేట్ వద్ద ఉండే ఈ జ్యోతిని శుక్రవారం ఆర్పివేసి.. అక్కడికి 400 మీటర్ల దూరంలో ఉన్న ‘జాతీయ యుద్ధ స్మారకం’ వద్ద ఉండే జ్యోతితో కలిపివేయనున్నట్లు తొలుత వార్తలు వచ్చాయి. ఈ రెండు జ్యోతులు నిర్విరామంగా వెలుగుతూ ఉండేలా చూడటం చాలా కష్టతరమనే అభిప్రాయం నేపథ్యంలో వీటిని కలపాలని కేంద్రం నిర్ణయించినట్లు జాతీయ మీడియా కథనాల్లో పేర్కొన్నారు. దీంతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సహా పలువురు విపక్ష నేతలు విచారం వ్యక్తం చేశారు. ‘‘మన ధీర సైనికుల గుర్తుగా వెలుగుతున్న జ్యోతిని నేడు ఆర్పివేస్తుండటం తీవ్ర విచారం కలిగిస్తోంది. కొంతమందికి దేశభక్తి, త్యాగనిరతి ఎన్నటికీ అర్థం కావు. మన సైనికుల కోసం అమర్ జవాన్ జ్యోతిని మేం మళ్లీ వెలిగిస్తాం’’ అని రాహుల్ ట్వీట్ చేశారు.
విపక్షాల నుంచి విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఈ వార్తలపై కేంద్ర ప్రభుత్వ వర్గాలు నేడు స్పష్టతనిచ్చాయి. ‘‘అమర జవాన్ జ్యోతి గురించి అసత్య ప్రచారం జరుగుతోంది. జ్యోతిని ఆర్పివేయట్లేదు. అందులోని కొంత భాగాన్ని జాతీయ యుద్ధ స్మారక జ్యోతితో కలుపుతున్నాం. ఇండియా గేట్ వద్ద ఉన్న ఈ స్మారకంపై 1971లో అమరులైన జవాన్ల పేర్లు లేవు. అయినప్పటికీ ఇక్కడ జ్యోతి వెలుగుతూ ఉండటం వారికిచ్చే నిజమైన నివాళి అనిపించుకోదు. అదే జాతీయ యుద్ధ స్మారకం వద్ద 1971 యుద్ధ అమరులతో పాటు అనేక మంది వీర జవాన్ల పేర్లను లిఖించారు. అక్కడే ఈ జ్యోతి కూడా వెలిగితేనే వారికి నిజమైన శ్రద్ధాంజలి ఘటించినట్లు అవుతుంది’’ అని ప్రభుత్వ వర్గాలు వివరించాయి.
1971లో భారత్-పాక్ యుద్ధంలో అమరులైన భారతీయ సైనికులకు గుర్తుగా ఇండియా గేట్ వద్ద స్మారకం నిర్మించారు. 1972 జనవరి 26న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ అమర్ జవాన్ జ్యోతిని వెలిగించారు. అయితే ఆ తర్వాత దేశ రాజధానిలో రూ.176కోట్లతో 40 ఎకరాల్లో జాతీయ యుద్ధ స్మారకాన్ని నిర్మించారు. అక్కడ విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన 25,942 మంది సైనికుల పేర్లను సువర్ణాక్షరాలతో గ్రానైట్ ఫలకాలపై లిఖించారు. 2019 ఫిబ్రవరి 25న ప్రధాని నరేంద్ర మోదీ దీన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత నుంచి ఇండియా గేట్ వద్ద జరిగే అన్ని సైనిక కార్యక్రమాలను జాతీయ యుద్ధ స్మారకం వద్దకు మార్చారు.