Amarnath: అమర్‌నాథ్‌ విషాదం.. 15వేల మంది యాత్రికులు సురక్షిత ప్రాంతానికి..

పవిత్ర అమర్‌నాథ్‌ క్షేత్రానికి సమీపంలో చోటుచేసుకున్న ఆకస్మిక వరద బీభత్సంలో మృతుల సంఖ్య 16కు చేరింది. మరో 40 మంది వరదల్లో గల్లంతవ్వగా.. వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు

Updated : 09 Jul 2022 14:53 IST

16కు చేరిన మృతులు.. కొనసాగుతోన్న గాలింపు

శ్రీనగర్‌: పవిత్ర అమర్‌నాథ్‌ క్షేత్రానికి సమీపంలో చోటుచేసుకున్న ఆకస్మిక వరద బీభత్సంలో మృతుల సంఖ్య 16కు చేరింది. మరో 40 మంది వరదల్లో గల్లంతవ్వగా.. వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు ఎన్‌డీఆర్‌ఎఫ్‌ డీజీ అతుల్ కర్వాల్ శనివారం వెల్లడించారు. ప్రస్తుతానికి ఘటనా ప్రాంతంలో కొండచరియలు ఏమీ విరిగిపడటం లేదని, అయితే ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోందని తెలిపారు. కానీ, సహాయక చర్యలకు ఎలాంటి ఆటంకం లేదన్నారు. ఎన్‌డీఆర్‌ఎఫ్‌తో పాటు భారత సైన్యం, ఎస్‌డీఆర్ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్, ఇతర భద్రతా సిబ్బంది సహాయకచర్యల్లో పాల్గొన్నారు.

ఆకస్మికంగా సంభవించిన వరద కారణంగా అమర్‌నాథ్‌ గుహ వద్ద వేలాది మంది చిక్కుకుపోయారు. ఇప్పటివరకు దాదాపు 15వేల మంది యాత్రికులను అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు ఐటీబీపీ అధికార ప్రతినిధి వెల్లడించారు. వరదల కారణంగా దాదాపు 65 మంది గాయపడ్డారు. వారిని వాయుసేన విమానాల్లో ఆసుపత్రికి తరలించారు.

దక్షిణ కశ్మీర్‌ హిమాలయాల్లోని మంచు లింగాన్ని దర్శించుకునేందుకు జూన్‌ 30 నుంచి అమర్‌నాథ్‌ యాత్ర ప్రారంభమైన విషయం తెలిసిందే. విడతల వారీగా నిత్యం వేలాది మంది భక్తులు ఈ యాత్రకు బయల్దేరుతారు. అయితే శుక్రవారం సాయంత్రం ఈ క్షేత్రానికి సమీపంలో ఒక్కసారిగా కుండపోత వర్షం కురవడంతో వరద పోటెత్తింది. చూస్తుండగానే కొండల పైనుంచి భారీఎత్తున వర్షపు నీరు ముంచెత్తింది. కొండలపైనుంచి పెద్ద ఎత్తున రాళ్లు, బురద కొట్టుకొచ్చాయి.

దీంతో యాత్రికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రాణభయంతో పరుగులు తీయడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. దీంతో అనేక మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. వరద బీభత్సం నేపథ్యంలో అమర్‌నాథ్‌ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు.

హెల్ప్‌లైన్‌ నంబర్లు ఇవే..

తాజా విపత్తు నేపథ్యంలో జమ్మూ-కశ్మీర్‌ అధికార యంత్రాంగం ప్రత్యేక సహాయక కేంద్రాన్ని (హెల్ప్‌లైన్‌) ఏర్పాటు చేసింది. శ్రీ అమర్‌నాథ్‌ క్షేత్రం బోర్డుతో కలిసి విపత్తుకు సంబంధించిన సమాచారాన్ని అందించేందుకు కొన్ని ఫోన్‌ నంబర్లను అందుబాటులోకి తెచ్చింది. 

ఎన్‌డీఆర్‌ఎఫ్‌:  011- 23438252, 011- 23438253

కశ్మీర్‌:  0194- 2496240

అమర్‌నాథ్‌ క్షేత్రం బోర్డు:  0194 -2313149

పహల్‌గామ్ పోలీసు కంట్రోల్‌ రూం: 9596779039, 9797796217, 01936243233, 01936243018

అనంత్‌నాగ్‌ పోలీసు కంట్రోల్‌ రూం: 9596777669, 9419051940, 01932225870, 01932222870


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని