Amarnath Yatra: ‘అమర్‌నాథ్‌’ బస్సు బ్రేకులు ఫెయిల్‌.. సైన్యం చాకచక్యంతో తప్పిన ముప్పు

బ్రేకులు ఫెయిల్‌ కావడంతో కదులుతోన్న బస్సులో నుంచి కిందికి దూకేసిన పలువురు అమర్‌నాథ్‌ యాత్రికులకు గాయాలయ్యాయి. జమ్మూకశ్మీర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.

Published : 02 Jul 2024 22:10 IST

శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌ (Jammu Kashmir)లో అమర్‌నాథ్‌ (Amarnath Yatra) యాత్రికులకు భయానక అనుభవం ఎదురైంది. తాము ప్రయాణిస్తున్న బస్సు బ్రేకులు ఫెయిల్‌ కావడంతో.. ఆందోళనకు గురైన వారు వాహనం కదులుతుండగానే కిందికి దూకేశారు. ఈ క్రమంలోనే 10 మందికి గాయాలయ్యాయి. భద్రత బలగాలు సకాలంలో స్పందించడంతో పెనుప్రమాదం తప్పింది. రామ్‌బన్‌ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. పంజాబ్‌లోని హోషియార్‌పుర్‌కు చెందిన దాదాపు 40 మంది యాత్రికులు అమర్‌నాథ్‌ దర్శనం చేసుకుని బస్సులో తిరుగుప్రయాణమయ్యారు.

గూగుల్‌ మ్యాప్స్‌ను నమ్మి.. దట్టమైన అడవిలో 11 గంటలు చిక్కుకొని..

జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై బనిహాల్‌ సమీపానికి చేరుకోగానే బస్సు బ్రేకులు ఫెయిలైనట్లు డ్రైవర్‌ తెలిపాడు. దీంతో ఆందోళనకు గురైన కొంతమంది ప్రాణభయంతో.. బస్సు కదులుతుండగానే కిందికి దూకేశారు. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు, ఓ చిన్నారి సహా 10 మందికి గాయాలైనట్లు అధికారులు తెలిపారు. పలువురు కిందికి దూకడాన్ని గమనించిన సైనిక సిబ్బంది, పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి.. బస్సు టైర్ల కింద రాళ్లు పెడుతూ చివరకు దాన్ని ఆపగలిగారు. వెంటనే అంబులెన్స్‌ను రప్పించి క్షతగాత్రులకు వైద్యసాయం అందించినట్లు అధికారులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని