Amarnath Yatra 2022: జూన్‌ 30 నుంచి అమర్‌నాథ్‌ యాత్ర

హిమాలయాల్లో ప్రతిఏటా వెలిసే అమర్‌నాథుడి స్వయంభూ మంచు లింగం దర్శనానికి సంబంధించి ఈ ఏడాది తేదీలు ఖరారయ్యాయి.

Published : 28 Mar 2022 01:31 IST

జమ్మూకశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కార్యాలయం వెల్లడి

శ్రీనగర్‌: హిమాలయాల్లో ఏటా వెలిసే అమర్‌నాథుడి మంచు లింగం దర్శనానికి సంబంధించి ఈ ఏడాది తేదీలు ఖరారయ్యాయి. జూన్‌ 30 నుంచి అమర్‌నాథ్‌ యాత్ర ప్రారంభం కానుంది. మొత్తం 43 రోజలపాటు ఈ యాత్ర కొనసాగనుంది. జమ్మూకశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా అధ్యక్షతన ఆదివారం జరిగిన శ్రీ అమర్‌నాథ్‌జీ దేవాలయ బోర్డు (ఎస్‌ఏఎస్‌బీ) సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎల్‌జీ కార్యాలయం వెల్లడించింది. పూర్తి కొవిడ్‌ నిబంధనల మధ్య కొనసాగుతుందని.. సంప్రదాయం ప్రకారం రక్షాబంధన్‌ రోజున ఈ యాత్ర ముగుస్తుందని తెలిపింది.

గత రెండు, మూడేళ్లుగా అమర్‌నాథ్‌ యాత్ర పూర్తిస్థాయిలో కొనసాగడం లేదు. జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 రద్దు సందర్భంగా 2019లో యాత్ర మధ్యలోనే రద్దు అయ్యింది. అనంతరం దేశంలో కొవిడ్‌ విస్తృతి పెరగడంతో రెండేళ్లుగా పూర్తి స్థాయిలో యాత్ర చేపట్టడం లేదు. ప్రస్తుతం కొవిడ్‌ ఉద్ధృతి అదుపులోనే ఉండడంతో ఈ యాత్రను యథావిధిగా కొనసాగించేందుకు జమ్మూకశ్మీర్‌ ప్రభుత్వం సిద్ధం అవుతోంది.

దక్షిణ కశ్మీర్‌లోని హిమాలయాల్లో దాదాపు 3880 మీటర్ల ఎత్తైన ప్రదేశంలో ఉన్న అమర్‌నాథుడి దర్శనం కోసం దేశవ్యాప్తంగా ఏటా భారీ ఎత్తున భక్తులు తరలివస్తుంటారు. మొత్తం 43 రోజుల పాటు ఈ యాత్ర జరుగుతుంది. కశ్మీర్‌లో ఉగ్రవాద ముప్పు ఉన్న నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత నడుమ ఈ యాత్ర కొనసాగుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని