
సచిన్ వాజే కేసులో కొత్త ట్విస్ట్..!
మరో ఇద్దరి ఎన్‌కౌంటర్‌కు పన్నాగం
ముంబయి: ముకేశ్ అంబానీకి బెదిరింపుల కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ సస్పెండైన పోలీస్ అధికారి సచిన్ వాజే కుట్ర ఒకటి కొత్తగా వెలుగులోకి వచ్చింది. మరో ఇద్దరిని హతమార్చేందుకు ఆయన కుట్ర పన్నినట్లు ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. ఎన్కౌంటర్ స్పెషలిస్టుగా పేరున్న సచిన్ వాజే ఇద్దర్ని చంపి ‘ఎన్కౌంటర్’గా చిత్రీకరించేందుకు వ్యూహం పన్నినట్లు ఎన్ఐఏ గుర్తించింది. అయితే, ఈ ప్రణాళిక అమలు కాకపోవడంతో ప్లాన్-బి అమలు చేసినట్లు ఎన్ఐఏ పేర్కొంది.
ముకేశ్ అంబానీ ఇంటివద్ద పేలుడు పదార్థాల వాహనం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సచిన్ వాజేను సుదీర్ఘంగా ఎన్ఐఏ విచారించింది. ఇందులో భాగంగా సచిన్ వాజే ఇంటిలో ఓ వ్యక్తి పాస్‌పోర్టును స్వాధీనం చేసుకున్న ఎన్ఐఏ.. దాని ఆధారంగా దర్యాప్తును చేపట్టింది. దీంతో ఈ కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. పాస్‌పోర్టులో ఉన్న వ్యక్తితో పాటు మరో వ్యక్తిని హతమార్చేందుకు సచిన్ వాజే కుట్ర పన్నినట్లు తేలింది. ముకేశ్ అంబానీ ఇంటివద్ద కారును వీరిద్దరే నిలిపారని చిత్రీకరించి.. అనంతరం వీరిని ఎన్కౌంటర్లో హతమార్చాలని వాజే పన్నాగం పన్నినట్లు ఎన్ఐఏ గుర్తించింది. తద్వారా పేలుడు పదార్థాల వాహనం కేసును ముగించిన ఘనతను దక్కించుకోవాలని సచిన్ వాజే భావించినట్లు అధికార వర్గాలు భావిస్తున్నాయి.
ప్లాన్ బీ అమలు..
ఔరంగాబాద్‌లో దొంగిలించిన మారుతీ ఎకో కారులో బాంబును అమర్చి ముకేశ్ అంబానీ స్వగృహం ఆంటిలియా ఎదుట నిలుపాలని సచిన్ వాజే తొలుత ప్రణాళిక రచించారు. ఈ కారును ఇద్దరు వ్యక్తులు అక్కడ నిలిపి వెళ్లిపోవాలని అనుకున్నారు (ఆ కారుకు సంబంధించిన నంబర్ ప్లేటును మిథి నదిలో ఎన్ఐఏ బృందం కనుగొంది). కానీ, ఈ ప్రణాళిక అమలు కాలేదు. దీంతో ప్లాన్-బీ అమలు చేసిన సచిన్ వాజే.. ఫిబ్రవరి 25న పేలుడు పదార్థాలతో ఉన్న ఓ ఎస్యూవీ కారును అంబానీ ఇంటి ముందుంచారు. అనంతరం పోలీసులు దానిని స్వాధీనం చేసుకోవడం.. ఆ కారు యజమానిగా భావిస్తోన్న మన్సుఖ్ హిరేన్ హత్యకు గురికావడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. ఇక మన్సుఖ్ హిరేన్ హత్యలోనూ వాజే కీలక నిందితుడని ఇప్పటికే దర్యాప్తు అధికారులు గుర్తించారు. అయితే, ఎన్కౌంటర్ స్పెషలిస్టుగా పేరుండటంతో.. తనకు ఏమీ కాదులే అనే భరోసాతో ప్రణాళిక రచించినట్లు దర్యాప్తులో పాల్గొన్న ఓ అధికారి అభిప్రాయపడ్డారు.
కేసు సాధించిన ఘనత కోసమే..?
ముకేశ్ అంబానీ బెదిరింపుల కేసును ఛేదించి ఈ ఘనతను సాధించాలనే ఈ ఎన్‌కౌంటర్‌కు ప్రణాళిక రచించినట్లు ఎన్ఐఏ అధికారులు అనుమానిస్తున్నారు. అంతేకాకుండా దీనిపేరు చెప్పి భారీగా డబ్బును కూడా సొమ్ము చేసుకోవచ్చని సచిన్ వాజే అంచనావేసినట్లు తెలుస్తోంది. ఇదిలాఉంటే, మన్సుఖ్ హిరేన్ హత్య కేసును ఛేదించడంలో దర్యాప్తు అధికారులు తలలుపట్టుకుంటున్నారు. విచారణలో భాగంగా సచిన్‌వాజే మరికొందరి సీనియర్ పోలీసు అధికారుల పేర్లను వెల్లడించినట్లు తెలుస్తోంది. ఎన్ఐఏ దర్యాప్తు ముమ్మరం చేసినప్పటికీ సచిన్ వాజే వాడిన మొబైల్ ఫోన్ మాత్రం మిస్టరీగా మారింది. ఏదేమైనా ఆధారాలు లభ్యమయ్యేంతవరకూ ఎవ్వరినీ విడిచిపెట్టేది లేదని ఎన్ఐఏ స్పష్టం చేస్తోంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.