Anant Ambani Wedding: అంబానీల ఇంట పెళ్లి సందడి : అతిథులను తరలించేందుకు 3 ఫాల్కన్‌ జెట్‌ విమానాలు

అంబానీ ఇంట పెళ్లి వేడుకల కోసం ఘనంగా ఏర్పాట్లు చేశారు. అతిథులను తరలించేందుకు ఫాల్కన్‌ జెట్లను సిద్ధం చేశారు. నేడు అనంత్‌ అంబానీ శివ్‌శక్తి పూజలో పాల్గొన్నారు. 

Updated : 13 Jul 2024 16:17 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అంబానీల ఇంట పెళ్లి వేడుకలకు హాజరుకానున్న అతిథుల కోసం ఘనంగా ఏర్పాట్లు చేశారు. గెస్ట్‌లను అనంత్‌ అంబానీ-రాధికా మర్చెంట్‌ల వివాహ వేదిక వద్దకు తరలించేందుకు మూడు ఫాల్కన్‌-2000 జెట్స్‌ను సిద్ధం చేశారు. ఈవిషయాన్ని క్లబ్‌ వన్‌ ఎయిర్‌ సంస్థ సీఈఓ రాజన్‌ మెహ్రా ఓ ఆంగ్ల వార్తా సంస్థకు వెల్లడించారు. ఈ మొత్తం వేడుకలకు దాదాపు 100 వరకు ప్రైవేటు విమానాలను వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. ‘అతిథులు నలుమూలల నుంచి ఈ పెళ్లికి వస్తున్నారు. వీరిని తరలించేందుకు దేశంలోని పలు ప్రదేశాల నుంచి చాలా ట్రిప్పులు ఈ విమానాలను తిప్పాల్సి ఉంటుంది’ అని ఆ సంస్థ సీఈవో రాజన్‌ పేర్కొన్నారు. 

ఇక వివాహ వేడుకల్లో భాగంగా నేడు శివ్‌శక్తి పూజను నిర్వహించారు. దీనిలో ముకేశ్‌ అంబానీ, నీతా, అనంత్‌, రాధిక పాల్గొన్నారు. స్వగృహం ఆంటిలియాలో ఏర్పాటుచేసిన భారీ జ్యోతిర్లింగం వద్ద ఈ కార్యక్రమం జరిగింది. ఈసందర్భంగా అమిత్‌ త్రివేది ‘నమో నమో’ పాటను ఆలపించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పండితులతో అనంత్‌-రాధిక జంట ఫొటోలు దిగింది.

అనంత్‌ పెళ్లి గురించి విదేశీ పత్రికలు కూడా ప్రత్యేక కథనాలు రాశాయి. ప్రపంచవ్యాప్తంగా 1200 మంది అతిథులు ఈ వేడుకకు హాజరవుతున్నట్లు వాయిస్‌ ఆఫ్‌ అమెరికా పత్రిక పేర్కొంది. చాలా అగ్రస్థాయి నేతలు కూడా వీరిలో ఉన్నట్లు వెల్లడించింది. ఈ వేడుకలకు 320 మిలియన్‌ డాలర్లకు పైగానే ఖర్చు చేస్తున్నట్లు ఆర్కిటెక్చరల్‌ డైజెస్ట్ పత్రిక పేర్కొంది.  

ఇక అతిథులకు వడ్డించే భోజనాలు కూడా ప్రత్యేకమే. జులై 12న ఇచ్చే పెళ్లి విందుకు వారణాసిలో ప్రసిద్ధి చెందిన కాశీ ఛాట్‌భండార్‌ వ్యాపారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మెనూలో కుల్ఫీ, ఫలూదా, టిక్కీ, టమాటా ఛాట్, పాలక్‌ ఛాట్, చనా కచోరీ, దహీ పూరి, బనారస్‌ ఛాట్‌ లాంటి స్పెషల్స్‌ను అతిథుల కోసం సిద్ధం చేయనున్నారు. వీటిని ముకేశ్‌ అంబానీ సతీమణి నీతా అంబానీయే స్వయంగా ఎంపిక చేశారు. ముంబయిలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌ జియో వరల్డ్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో మూడు రోజులపాటు ఈ పెళ్లి వేడుకలు జరగనున్నాయి. జులై 12న శుభ్‌ వివాహ్‌తో మొదలై.. 13న శుభ్‌ ఆశీర్వాద్, 14న మంగళ్‌ ఉత్సవ్‌తో ముగుస్తాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని