హెలికాప్టర్‌ ఘటన: పార్థివ దేహాలు తరలిస్తున్న అంబులెన్సుకు ప్రమాదం!

తమిళనాడులోని కున్నూరులో బుధవారం జరిగిన హెలికాప్టర్‌ ప్రమాద ఘటన పార్థివ దేహాలను తరలిస్తున్న అంబులెన్సుకు ప్రమాదం జరిగింది.

Published : 09 Dec 2021 19:26 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తమిళనాడులోని కున్నూరులో బుధవారం జరిగిన హెలికాప్టర్‌ ప్రమాద ఘటన పార్థివ దేహాలను తరలిస్తున్న అంబులెన్సుకు ప్రమాదం జరిగింది. ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారిని దిల్లీకి తరలించేందుకు గురువారం కున్నూర్‌ నుంచి సూలూరు ఎయిర్‌బేస్‌కు అంబులెన్సుల్లో తీసుకెళ్తుండగా గురువారం ఈ ప్రమాదం సంభవించింది. కోయంబత్తూరు వద్ద ఓ అంబులెన్సు ముందు వెళుతున్న అంబులెన్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో కొందరు పోలీసులకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదానికి గురైన అంబులెన్సులోని పార్థివ దేహాలను మరో అంబులెన్సులోకి ఎక్కించారు.

మరోవైపు ప్రమాదంలో చనిపోయిన వారికి అంబులెన్సులు వెళుతున్న మార్గంలోని స్థానికులు నివాళులర్పించారు. వాహన శ్రేణిని చూసి కొందరు వాహనశ్రేణిపై పూలు చల్లుతూ ‘భారత్‌ మాతాకీ జై’ అంటూ నినదించారు. దీంతో ఆ ప్రాంతమంతా ఉద్విగ్నభరిత వాతావరణం నెలకొంది. జనరల్‌ బిపిన్‌ రావత్‌, ఆయన సతీమణి మధులిక సహా మొత్తం 14 మంది ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ నీలగిరి జిల్లా కున్నూర్‌ సమీపంలో కూలిపోయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో జనరల్‌ రావత్‌ దంపతులు సహా 13 మంది దుర్మరణం పాలయ్యారు. గ్రూప్‌ కెప్టెన్‌ వరుణ్‌ సింగ్‌ ఒక్కరే ప్రాణాలతో బయటపడ్డారు. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు.  రేపు ఉదయం బిపిన్‌ రావత్‌ అంత్యక్రియలు దిల్లీలో జరగనున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని