TikTok, WeChat నిషేధంపై అమెరికా నిర్ణయం

టిక్‌టాక్‌, వీచాట్‌లను నిషేధిస్తూ జారీచేసిన ఉత్తర్వులపై సమీక్ష జరపాలంటూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ వాణిజ్యశాఖ అధికారులను ఆదేశించారు.

Published : 10 Jun 2021 01:34 IST

కొత్త ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌ జారీచేసిన బైడెన్‌

వాషింగ్టన్: దేశ భద్రతకు ముప్పు ఉందనే కారణాలతో చైనా యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకోలేకుండా అమెరికా ప్రభుత్వం నిషేధం విధించిన విషయం తెలిసిందే. వీటిపై మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీసుకున్న నిర్ణయాలను ఉపసంహరించుకునేందుకు జో బైడెన్‌ ప్రభుత్వం ప్రయత్నాలను మొదలు పెట్టింది. ఇందులో భాగంగా టిక్‌టాక్‌, వీచాట్‌లను నిషేధిస్తూ జారీచేసిన ఉత్తర్వులపై సమీక్ష జరపాలంటూ అధ్యక్షుడు జో బైడెన్‌ వాణిజ్యశాఖ అధికారులను ఆదేశించారు.

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పదవిలో ఉన్న సమయంలో సామాజిక మాధ్యమ సంస్థలు, వీడియో షేరింగ్‌ యాప్‌లపై కఠినంగా వ్యవహరించారు. ముఖ్యంగా దేశ భద్రతకు ముప్పు పొంచి ఉందన్న కారణంతో చైనా యాప్‌లపై నిషేధం విధించేందుకు కార్యనిర్వాహక ఉత్తర్వులను (Executive Orders) జారీచేశారు. దీంతో అమెరికాలో ఆ యాప్‌లను కొత్తగా డౌన్‌లోడ్‌ చేసుకోకుండా నిరోధించగలిగారు. అయితే, డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఇలాంటి నిర్ణయాలను జో బైడెన్‌ ప్రభుత్వం సమీక్షిస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే ఎనిమిది యాప్‌లపై సమీక్ష జరపాలని ఆదేశాలివ్వగా.. తాజాగా టిక్‌టాక్‌, వీచాట్‌లను కూడా ఆ జాబితాలో చేర్చేందుకు సిద్ధమయ్యింది. అయితే, టిక్‌టాక్‌ వల్ల పొంచివున్న ముప్పుపై అక్కడి జాతీయ భద్రతా సంస్థ ప్రత్యేకంగా సమీక్ష కొనసాగిస్తుందని వైట్‌హౌస్‌ పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని