American Airlines: సాయం కోరినందుకు క్యాన్సర్‌ రోగిని విమానం నుంచి దించేసిన సిబ్బంది!

శస్త్ర చికిత్స కారణంగా శరీరం బలహీనంగా ఉండటంతో బ్యాగ్‌ క్యాబిన్‌లో పెట్టేందుకు సాయం చేయని ఎయిర్‌హోస్టెస్‌ను కోరిన ప్రయాణికురాలిని విమానం నుంచి దించేసిన ఘటన దిల్లీలో చోటు చేసుకుంది.

Published : 06 Feb 2023 01:23 IST

దిల్లీ: విమానాల్లో ప్రయాణికుల అసభ్య ప్రవర్తన, విమాన సిబ్బందికి, ప్రయాణికులకు మధ్య వాగ్వివాదం వంటి ఘటనలు ఇటీవల తరచూ వెలుగుచూస్తున్నాయి. తాజాగా సిబ్బంది సాయం కోరినందుకు మహిళా ప్రయాణికురాలిని విమానం నుంచి దింపేసిన ఘటన దిల్లీలో చోటుచేసుకుంది. జనవరి 30న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. మీనాక్షి సేన్‌గుప్తా అనే మహిళకు కొద్ది రోజుల క్రితం క్యాన్సర్ సంబంధిత శస్త్రచికిత్స జరిగింది. జనవరి 30న ఆమె దిల్లీ నుంచి న్యూయార్క్‌కు ప్రయాణించేందుకు అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌ (American Airlines) విమానం 293 లో టికెట్‌ బుక్‌ చేసుకున్నారు. శస్త్ర చికిత్స కారణంగా బలహీనంగా ఉన్న ఆమె వీల్‌ఛైర్‌ అసిస్టెంట్‌ ద్వారా విమానంలోకి వచ్చినట్లు తెలిపారు. తర్వాత తన వెంట తెచ్చుకున్న బ్యాగ్‌ను క్యాబిన్‌లో పెట్టాలని ఎయిర్‌హోస్టెస్‌ (Air Hostess) సాయం కోరగా అందుకు ఆమె తిరస్కరించి, విమానం నుంచి దిగిపోవాలని కోరినట్లు మీనాక్షి చెప్పారు. శరీరానికి సపోర్ట్‌గా ఉండే బెల్ట్‌ ధరించి ఉండటం వల్ల తాను బ్యాగ్‌ను పైకి ఎత్తలేకపోయానని, అందుకే విమాన సిబ్బంది సాయం కోరినట్లు ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 

‘‘ గ్రౌండ్‌ స్టాఫ్‌ నన్ను విమానంలో విడిచిపెట్టిన తర్వాత నా బ్యాగ్‌ను క్యాబిన్‌లో పెట్టేందుకు ఎయిర్‌హోస్టెస్‌ సాయం కోరాను. అది తన ఉద్యోగం కాదని ఆమె వెళ్లిపోయింది. నా ఆరోగ్య పరిస్థితి గురించి ఆమెకు వివరించినా సాయం చేసేందుకు సుముఖత చూపలేదు. దీంతో నా బ్యాగ్‌ను సీటు పక్కన ఉంచి కూర్చునున్నాను. కొద్దిసేపటి తర్వాత నా దగ్గరికి వచ్చిన ఆమె మీరు అసౌకర్యంగా భావిస్తుంటే విమానం నుంచి దిగిపొమ్మని అమర్యాదగా నాతో చెప్పింది. విమాన సిబ్బంది మొత్తం నేను దిగిపోవాలని కోరారు. దీంతో విమానం నుంచి దిగిపోయాను’’ అని మీనాక్షి దిల్లీ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. 

ఈ ఘటన సంబంధించిన విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో విమాయాన సంస్థ, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కేంద్ర విమానయాన మంత్రిత్వశాఖ (MoCA), డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (DGCA)ను కోరుతూ నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు. మరోవైపు ఘటనపై స్పందించిన డీజీసీఏ నివేదిక సమర్పించాలని అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌ను కోరింది. ‘‘జనవరి 30 దిల్లీ-న్యూయార్క్‌ విమానంలో సిబ్బంది సూచనలు పాటించని కారణంగా ప్రయాణికురాలిని మా క్యాబిన్‌ సిబ్బంది విమానం నుంచి దించేశారు. మా కస్టమర్‌ రిలేషన్స్ సిబ్బంది సదరు ప్రయాణికురాలితో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నాం ’’అని అమెరికన్‌ ఎయిర్‌లైన్స్ ఒక ప్రకటనలో తెలిపింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని