Coronavirus Origin: కరోనా మూలాలు ఎప్పటికీ కనిపెట్టలేమా?

యావత్తు ప్రపంచాన్ని ఓ కుదుపు కుదిపిన కరోనా మహమ్మారి మూలాలు మాత్రం ఇప్పటికీ చిక్కలేదు...

Published : 30 Oct 2021 13:08 IST

అమెరికా నిఘా సంస్థలు ఏమంటున్నాయంటే..

వాషింగ్టన్‌: యావత్తు ప్రపంచాన్ని ఓ కుదుపు కుదిపిన కరోనా మహమ్మారి మూలాలు ఇప్పటికీ చిక్కలేదు. ఐక్యరాజ్య సమితి నిపుణుల బృందం, అమెరికా నిఘా సంస్థలు జరిపిన విస్తృత స్థాయి అధ్యయనాలు చివరకు ఫలితం తేల్చకుండానే ముగిసే సూచనలు కనిపిస్తున్నాయి. తాజాగా దీనిపై అధ్యయనం జరిపిన ఓ అమెరికా నిఘా సంస్థ కీలక వ్యాఖ్యలు చేసింది. కొవిడ్‌ మూలాలు ఎప్పటికీ కనిపెట్టలేమేమోనని అనుమానం వ్యక్తం చేసింది.

తీవ్ర ఒత్తిడి మధ్య అమెరికా నిఘా సంస్థలను గత మే నెలలో అధ్యక్షుడు బైడెన్ 90 రోజుల విచారణకు ఆదేశించారు. మహమ్మారి మూలాలపై ఉన్న రెండు రకాల వాదనలపై విస్తృత అధ్యయనం చేపట్టాలని నిర్దేశించారు. దీనిపై దర్యాప్తు జరిపిన నిఘా సంస్థలు ఆగస్టులోనే నివేదికను సమర్పించాయి. జంతువుల నుంచి మనిషికి ఈ వైరస్ సోకి ఉంటుందనే వాదనతో పాటు ల్యాబ్‌లో సృష్టించారన్న వాదనకు కూడా సమాన అవకాశాలు ఉన్నాయన్నారు.

తాజాగా దీనిపై శుక్రవారం మరో నివేదిక బహిర్గతమైంది. ఏ ఒక్క వాదనకు బలమైన ఆధారాలు లేవని పరిశోధకులు తేల్చి చెప్పారు. ఇప్పటి వరకు వైరస్‌ మూలాలపై అమెరికా నిఘా సంస్థలకు చాలా తక్కువే తెలుసని అంగీకరించారు. అయితే, వైరస్‌ను జీవాయుధంగా మాత్రం సృష్టించి ఉండకపోవచ్చునని నివేదికలో పేర్కొన్నారు. నేషనల్‌ ఇంటెలిజెన్స్‌ కౌన్సిల్‌తో పాటు మరో నాలుగు నిఘా సంస్థలు వైరస్‌ సహజసిద్ధంగా జన్మించి ఉంటుందన్న వాదనవైపు మొగ్గుచూపాయి. ‘ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌’ మాత్రం ల్యాబ్‌ నుంచి లీక్‌ అయ్యి ఉంటుందన్న వాదనను విశ్వసిస్తున్నట్లు పేర్కొంది. కానీ, వీటిలో ఏ ఒక్క సంస్థ నేషనల్‌ ఇంటెలిజెన్స్‌ డైరెక్టర్‌కు లేదా శ్వేతసౌధానికి వైరస్‌ పుట్టుకకు ఇదే కారణమంటూ బలమైన ఆధారాలను ఇవ్వలేకపోయాయి. దీంతో రెండు వాదనలపై ఇంకా అనుమానాలు కొనసాగుతూనే ఉన్నాయి.

ప్రకృతిలో సహజసిద్ధంగా కనిపించని.. కరోనా కుటుంబానికి చెందిన కొన్ని వైరస్‌లను వుహాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ ల్యాబ్‌లో సృష్టించారని నివేదికలో పేర్కొన్నారు. కానీ, కొవిడ్‌-19కు కారణమైన కరోనా కూడా అదే కోవకు చెందిందా.. లేదా.. అన్నది మాత్రం చెప్పలేమని నిఘా సంస్థలు తెలిపాయి. దీనిపై మరింత లోతైన సమాచారం లభిస్తే తప్ప వైరస్‌ మూలాలపై ఓ నిర్దిష్టమైన అభిప్రాయానికి రాలేమని తేల్చిచెప్పాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని