
Elizabeth: అమెరికన్ టూరిస్టులు.. క్వీన్ ఎలిజబెత్‌ను గుర్తుపట్టలేదు!
లండన్: కొందరు వ్యక్తులు వారి వృత్తి, వ్యాపారం, నేపథ్యంతో ప్రపంచవ్యాప్తంగా చాలా పాపులారిటీ తెచ్చుకున్నారు. అలాంటి వారిని ప్రపంచంలో ఏ మూలన ఉన్న వ్యక్తి అయినా ఇట్టే గుర్తుపట్టేస్తారు. అలాంటి వ్యక్తుల్లో బ్రిటన్ క్వీన్ ఎలిజబెత్ ఉండటం ఆశ్చర్యమేమి కాదు. ఆమె కేవలం బ్రిటన్‌కే కాదు.. కామన్‌వెల్త్ దేశాలకు కూడా నామమాత్రపు అధినేత్రి. ఆమెను ఒక్కసారి చూసినా.. కలిసినా అదే మహాభాగ్యం అనుకునేవారు బోలేడు మంది. అలాంటిది.. నేరుగా బ్రిటన్ రాణి ఎలిజబెత్ ఎదురుపడినా కొంతమంది అమెరికన్ పర్యటకులు గుర్తించలేకపోయారు. పైగా మీరు ఎలిజబెత్‌ను కలిశారా? అని ఆమెనే ప్రశ్నించారట. ఎలిజబెత్‌కు ఎదురైన ఈ వింత ఘటన గురించి ఆమెకు గతంలో సహాయకుడిగా పనిచేసిన రిచర్డ్ గ్రిఫిన్స్ ఇటీవల మీడియాతో పంచుకున్నారు.
క్వీన్ ఎలిజబెత్.. ఏటా వేసవికాలంలో కొన్ని రోజులు సేద తీరడం కోసం స్కాట్లాండ్‌లోని బల్మోరాల్ ఎస్టేట్‌కు వెళ్తుంటారు. నిత్యం రాజరికపు ఆర్భాటాలు, భారీ భద్రత మధ్య జీవితాన్ని గడిపే ఎలిజబెత్.. ఈ ఎస్టేట్‌లో ఎంతో నిరాడంబరంగా ఉంటారు. తన పెంపుడు జంతువులతో నడకకు, పిక్నిక్స్‌కు వెళ్తారు. ఓసారి కొంతమంది అమెరికన్ టూరిస్టులు ఆ ఎస్టేట్‌ను సందర్శించేందుకు వచ్చారట. అప్పుడే ఎలిజబెత్ నడకకు వెళ్తూ వారికి ఎదురుపడ్డారు. అయితే, అమెరికన్లు ఆమెను పలకరించారు.. కానీ ఆమెనే ఎలిజబెత్ అని గుర్తించలేకపోయారు. పైగా.. మీరు క్వీన్ ఎలిజబెత్‌ను కలిశారా? అని ఎలిజబెత్‌నే ప్రశ్నించారు. ఆ సమయంలో గ్రిఫిన్ కూడా అక్కడే ఉన్నారట. అమెరికన్లు అడిగిన ప్రశ్నను చూసి ఆశ్చర్యపోవడం అతడి వంతయింది.
కాగా.. అమెరికన్ టూరిస్టుల ప్రశ్నకు ఎలిజబెత్ ఎంతో చమత్కారంగా సమాధానం ఇచ్చారు. ‘ఎలిజబెత్ ఇల్లు దగ్గర్లోనే ఉంది. నేనెప్పుడు ఆమెను కలవలేదు. కానీ, ఇతను(గ్రిఫిన్‌ను చూపిస్తూ) కలిశాడు’’అని చెప్పారట. ఆమె మాటలు ఏ మాత్రం అర్థం కాని టూరిస్టులు బిక్కముఖం వేసుకొని వెళ్లిపోయారని గ్రిఫిన్ చెప్పుకొచ్చాడు. దాదాపు 30ఏళ్లుపాటు ఆయన రాయల్ కుటుంబానికి సహాయకుడిగా పనిచేశారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.