కరోనా వేళా టికెట్‌ లేకుండా 27 లక్షల మంది!

కరోనా నేపథ్యంలో గతేడాది రైళ్లు నడిచింది పరిమితంగానే. తర్వాత ప్రారంభమైనా అది కూడా పూర్తి స్థాయిలో కాదు. దీనికి తోడు రైల్వే స్టేషన్‌లో ప్రవేశించాలంటే కన్ఫామ్‌ టికెట్‌ ......

Published : 06 Jun 2021 19:43 IST

దిల్లీ: కరోనా నేపథ్యంలో గతేడాది రైళ్లు నడిచింది పరిమితంగానే. తర్వాత ప్రారంభమైనా అది కూడా పూర్తి స్థాయిలో కాదు. దీనికి తోడు రైల్వే స్టేషన్‌లో ప్రవేశించాలంటే కన్ఫామ్‌ టికెట్‌ తప్పనిసరి. వెయిటింగ్‌ లిస్ట్‌ టికెట్‌ ఉన్న వారికి లోపలికి నో ఎంట్రీ. కరోనా లక్షణాలు ఉంటే ప్రయాణానికి అనుమతి లేదు. ఇన్ని ఆంక్షల నేపథ్యంలో రైల్వేస్టేషన్లకు జనాల తాకిడి తగ్గిందనే చెప్పాలి. అలాంటి సమయంలోనూ టికెట్‌ లేకుండా రైళ్లలో ప్రయాణించిన ‘మహానుభావులు’ ఉన్నారంటే నమ్ముతారా? నమ్మకశక్యంగా లేకపోయినా ఇది నిజం. గతేడాది దేశవ్యాప్తంగా 27 లక్షల మంది టికెట్‌ లేకుండా ప్రయాణించారని రైల్వే శాఖ చెబుతోంది. మధ్యప్రదేశ్‌కు చెందిన చంద్రశేఖర్‌ గౌర్‌ అనే ఆర్టీఐ కార్యకర్త దాఖలు చేసిన స.హ. దరఖాస్తుకు ఈ మేరకు సమాధానం ఇచ్చింది.

2020 ఏప్రిల్‌ నుంచి 2021 మార్చి మధ్య మొత్తం 27.57లక్షల మంది టికెట్‌ లేకుండా ప్రయాణించి పట్టుబడ్డారని, వారి నుంచి రూ.143.82 కోట్లు వసూలు చేసినట్లు రైల్వే బోర్డు తెలిపింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఈ విధంగా 1.10 కోట్ల మంది పట్టుబడడం విశేషం. అప్పటితో పోలిస్తే ఈ సంఖ్య నాలుగో వంతే అయినప్పటికీ కరోనా వేళా ఈ విధంగా ప్రయాణించడం గమనార్హం. దేశంలో గతేడాది లాక్‌డౌన్‌ సమయంలో రైళ్లు పూర్తిగా నడవలేదు. జూన్‌ నుంచి ప్రారంభమైనా అవీ పాక్షికంగానే నడిచాయి.  అసలు రైల్వే అధికారులకు చిక్కింది 27 లక్షలైతే.. చిక్కని వారెందరో మరి!!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని