కరోనా కట్టడికి దిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం

దేశ రాజధానిలో కరోనా వైరస్‌ కేసులు క్రమంగా పెరుగుతున్న తరుణంలో దిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి మధ్యాహ్నం 3గంటల నుంచి రాత్రి 9గంటల వరకు ఎలాంటి రిజిస్ట్రేషన్‌ లేకుండా వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు నిర్ణయించింది.

Updated : 27 Mar 2021 13:43 IST

దిల్లీ: దేశ రాజధానిలో కరోనా వైరస్‌ కేసులు క్రమంగా పెరుగుతున్న తరుణంలో దిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి మధ్యాహ్నం 3గంటల నుంచి రాత్రి 9గంటల వరకు ఎలాంటి రిజిస్ట్రేషన్‌ లేకుండా వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు నిర్ణయించింది. ఈ మేరకు దిల్లీ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్‌ శనివారం ఓ సమావేశంలో వెల్లడించారు. ‘వ్యాక్సిన్‌ కోసం రిజిస్ట్రేషన్‌ చేసుకునేందుకు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలామందికి సాంకేతిక పరిజ్ఞానం ఉండదు. కాబట్టి ఇక నుంచి మధ్యాహ్నం 3గంటల నుంచి 9గంటల వరకు రిజిస్ట్రేషన్‌ లేకుండానే వ్యాక్సిన్‌ వేసేందుకు నిర్ణయించాం’ అని తెలిపారు.

‘కరోనా వైరస్‌ కేసులను అరికట్టేందుకు లాక్‌డౌన్‌ మాత్రమే పరిష్కారం కాదు. కాబట్టి ప్రస్తుతం దిల్లీలో లాక్‌డౌన్‌ విధించే అవకాశాలు లేవు. ఇప్పటికే ఒకసారి లాక్‌డౌన్‌ విధించాం. అప్పుడు వైరస్‌ ఎలా వ్యాప్తి చెందుతుందో ఎవరికీ తెలియదు కాబట్టి విధించడంలో అర్థం ఉంది. అప్పట్లో 14 రోజులు లేదా 21 రోజులు పెంచుతూ దేశాన్ని లాక్‌డౌన్‌లో ఉంచినప్పటికీ వైరస్‌ వ్యాప్తి మాత్రం ఆగలేదు. కాబట్టి వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు లాక్‌డౌన్‌ అనేది పరిష్కారం కాదు. ప్రస్తుతం నిత్యం 90వేల కరోనా పరీక్షలు చేస్తున్నాం. అంతేకాకుండా కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ కూడా చేసి సదరు వ్యక్తుల్ని ఐసోలేషన్‌లో ఉంచుతున్నాం. ఇక ఆస్సత్రుల్లోనూ పడకలు తగినన్ని అందుబాటులో ఉన్నాయి. కేవలం 20శాతం మాత్రమే నిండి ఉన్నాయి. ఎప్పటికప్పుడు పరిస్థితులను పరిశీలిస్తున్నాం. అవసరమైతే పడకల సంఖ్యను పెంచుతాం’ అని జైన్‌ తెలిపారు. 

కాగా గడిచిన 24 గంటల్లో దిల్లీలో 1,534 కేసులు నమోదయ్యాయి. తొమ్మిది మంది కరోనాతో ప్రాణాలు వదిలారు. దీంతో ఇప్పటి వరకు దిల్లీలో నమోదైన కేసుల సంఖ్య 6,45,276కు చేరింది. ప్రస్తుతం 6,051 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 10,987కు చేరింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని