Amit Shah: బెంగాల్‌లో ఘర్షణలపై హోం మంత్రి అమిత్‌ షా ఆరా.. గవర్నర్‌కు ఫోన్‌

పశ్చిమబెంగాల్‌ (West Bengal) లో చోటు చేసుకున్న ఘర్షణలపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా (Amit shah) ఆరా తీశారు. గవర్నర్‌ సీవీ ఆనంద్‌ బోస్‌ (CV Anand Bose)కు ఫోన్‌ చేసి తాజా పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.

Published : 31 Mar 2023 21:57 IST

దిల్లీ: శ్రీరామ నవవి వేడుకల సందర్భంగా గురువారం పశ్చిమబెంగాల్‌ (West Bengal)లో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా (Amit Shah) ఆరా తీశారు. గవర్నర్‌ సీవీ ఆనంద్‌ బోస్‌ (CV Anand Bose) తోపాటు భాజపా (BJP) రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత మజుందార్‌కు ఫోన్‌ చేసి తాజా పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. శాంతి భద్రతలను అదుపులోకి తెచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. మరోవైపు ఘర్షణలు చోటు చేసుకున్న ప్రాంతాల్లో గవర్నర్ పర్యటించనున్నారు. ఆ తర్వాత ఘర్షణలకు దారితీసిన పరిస్థితులను వివరిస్తూ కేంద్ర హోంశాఖకు నివేదిక పంపే అవకాశముంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో గురువారం రాత్రి హవ్‌డా, ఖాజీపరా పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. సోదాలు నిర్వహించి ఘర్షణలతో సంబంధం ఉన్న 36 మందిని అరెస్టు చేశారు. ప్రస్తుతం పరిస్థితులు ప్రశాంతంగానే ఉన్నట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. 

తాజా ఘటనలపై అధికార తృణమూల్‌, భాజపా పార్టీల నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు. మతవిద్వేషాలను రెచ్చగొట్టేందుకు భాజపా ప్రయత్నిస్తోందని విమర్శించారు.‘‘ వాళ్లకు కేటాయించిన మార్గంలో కాకుండా హఠాత్తుగా ర్యాలీ మార్గాన్ని ఎందుకు మార్చుకున్నారు. ఇతరులపై దాడి చేసి, చట్టపరమైన జోక్యం ద్వారా ఉపశమనం పొందాలని భావించే వాళ్లను ప్రజలు తిరస్కరిస్తారని తెలుసుకోవాలి’’ అంటూ భాజపా నేతలను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరోవైపు ఘర్షణలకు తృణమూల్‌ కాంగ్రెస్సే కారణమని భాజపా ఆరోపిస్తోంది. రాష్ట్రంలోని హిందువులు ప్రమాదంలో ఉన్నారని భాజపా ఎంపీ లాకెట్‌ ఛటర్జీ అన్నారు. పరిస్థితుల సున్నితత్వం దృష్ట్యా ఘర్షణ జరిగిన ప్రాంతాల్లో ఎన్‌ఐఏ, కేంద్ర దళాలను మోహరించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ హైకోర్టులో భాజపా పిటిషన్‌ దాఖలు చేసింది.

శ్రీరామ నవమి వేడుకల సందర్భంగా దేశవ్యాప్తంగా గురువారం కొన్ని చోట్ల ఘర్షణలు చోటు చేసుకున్నాయి. గుజరాత్‌లోని వడోదరలో రెండు చోట్ల రాళ్ల దాడులు చోటుచేసుకున్నాయి. ఫతేపురలో ఎవరికీ గాయాలు కాకపోగా.. కుంభర్‌వాడలో ఒక మహిళసహా కొంతమంది గాయపడ్డారు. పశ్చిమ బెంగాల్‌లోని హావ్‌డాలో ఊరేగింపు సందర్భంగా రెండు వర్గాల మధ్య ఘర్షణలు జరిగాయి. పలు వాహనాలకు దుండగులు నిప్పుపెట్టారు. దుకాణాలను ధ్వంసం చేశారు. బెంగాల్‌లో భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌లు దాదాపు 1000 ఊరేగింపులను నిర్వహించాయి. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో రామ మందిరం వద్ద జరిగిన ఘర్షణలో 10 మంది పోలీసులతో సహా 12 మంది గాయపడ్డారు. రెండు వర్గాలు ఘర్షణ పడటంతో 500 మంది ఓ వర్గానికి చెందినవారు రాళ్లు, పెట్రోలు సీసాలను విసిరారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు