Jammu Kashmir: జమ్మూకశ్మీర్‌లో వరుస ఉగ్రదాడులు.. అమిత్‌ షా ఉన్నతస్థాయి సమావేశం

జమ్మూకశ్మీర్‌లో వరుసగా ఉగ్రదాడులు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో అక్కడి శాంతిభద్రతల పరిస్థితిపై కేంద్రమంత్రి అమిత్‌ షా ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. 

Updated : 16 Jun 2024 14:10 IST

దిల్లీ: జమ్మూకశ్మీర్‌ (Jammu Kashmir)లో వరుసగా చోటుచేసుకొంటున్న ఉగ్ర ఘటనలు కలకలం సృష్టిస్తున్నాయి. టెర్రరిజంపై ఉక్కుపాదం మోపేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలోనే అక్కడి శాంతిభద్రతల పరిస్థితిపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా (Amit Shah) అధ్యక్షతన ఆదివారం దిల్లీలో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఉగ్రవాదం అణచివేతను వేగవంతం చేయడానికి ఆయన మార్గదర్శకాలు జారీ చేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

జూన్‌ 29 నుంచి అమర్‌నాథ్ యాత్ర ప్రారంభంకానుంది. లక్షల సంఖ్యలో భక్తులు పాల్గొననున్న నేపథ్యంలో అక్కడ తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై కూడా అమిత్‌ షా సమీక్ష నిర్వహించినట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ సరిహద్దుల్లో బలగాల మోహరింపు, చొరబాటు యత్నాలు తిప్పికొట్టడం, ఉగ్రవాద నిర్మూలనా కార్యకలాపాలపై షా అధికారులతో చర్చించారు. 

దర్శన్‌, పవిత్రా గౌడలకు వివాహమైందా? ఆయన లాయర్‌ ఏమన్నారంటే..

నాలుగు రోజుల వ్యవధిలోనే జమ్మూకశ్మీర్‌లో వరుస ఉగ్రదాడులు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. అక్కడి పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ.. హోం మంత్రి అమిత్‌ షా, ఎన్‌ఎస్‌ఏ అజిత్‌ డోభాల్‌, జమ్మూ-కశ్మీర్‌ ఎల్జీ మనోజ్‌సిన్హాలతో ఇటీవల సమీక్ష జరిపారు. ఈ క్రమంలోనే ఉగ్రవాదం నిర్మూలనకు పూర్తిస్థాయిలో శక్తిసామర్థ్యాలను వినియోగించాలని ప్రధాని ఆదేశించారు. ఆయన ఆదేశాల మేరకు చర్యలను ముమ్మరం చేయనున్నారు.

నేడు అమిత్‌ షా అధ్యక్షత జరిగిన సమావేశంలో అజిత్‌ డోభాల్‌, జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే, లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది సహా ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా.. ప్రధానిగా మోదీ ప్రమాణస్వీకారం రోజునే యాత్రికులే లక్ష్యంగా పర్యాటక బస్సుపై ఉగ్రవాదులు జరిపిన దాడి సంచలనం సృష్టించింది. ఈ దారుణానికి పాల్పడింది తామేనంటూ పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తొయిబాకు ముసుగు సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్‌ఎఫ్‌) ప్రకటించుకుంది. భవిష్యత్తులో మరిన్ని దాడులకు పాల్పడతామని హెచ్చరించింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని