Mamata Banerjee: రాజ్యాంగాన్ని ఏమైనా మార్చుతున్నారా..? అమిత్‌ షా వ్యాఖ్యలపై మమత మండిపాటు

పశ్చిమ బెంగాల్(West Bengal) పర్యటనలో భాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను సీఎం మమతా బెనర్జీ(Mamata Banerjee) తప్పుపట్టారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చివేయడం గురించి ఆయన మాట్లాడటమేంటని ప్రశ్నించారు. 

Published : 17 Apr 2023 19:33 IST

కోల్‌కతా: 2025 తర్వాత పశ్చిమ బెంగాల్‌(West Bengal)లోని తృణమూల్ కాంగ్రెస్(TMC) ప్రభుత్వం మనుగడలో ఉండదని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా(Amit Shah) చేసిన వ్యాఖ్యలపై ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ(Mamata Banerjee) తీవ్రంగా స్పందించారు. ఆయన వ్యాఖ్యలు అప్రజాస్వామికం, రాజ్యాంగ విరుద్ధమని మండిపడ్డారు. ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. 

‘శుక్రవారం అమిత్‌ షా(Amit Shah) ఓ ర్యాలీలో పాల్గొన్నారు. అక్కడవరకూ బాగానే ఉంది. కానీ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఓ రాష్ట్ర ప్రభుత్వం కూల్చివేత గురించి కేంద్ర హోం మంత్రి ఎలా మాట్లాడతారు..? లోక్‌సభ ఎన్నికల్లో భాజపా 35 స్థానాలు గెలుచుకుంటే.. రాష్ట్రప్రభుత్వం తన పదవీకాలాన్ని పూర్తి చేయదన్నారు. దేశ రాజ్యాంగాన్ని ఏమైనా మార్చుతున్నారా..?’ అని విలేకరులతో మాట్లాడుతూ ప్రశ్నించారు. దీదీ సర్కార్‌కు 2026 మే వరకు గడువు ఉన్న సంగతి తెలిసిందే. 

అలాగే దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు సీబీఐ సమన్లు జారీ చేయడంపై మమత(Mamata Banerjee) స్పందించారు. ‘ముఖ్యమంత్రికి కూడా సమన్లు అందుతాయని, దర్యాప్తు సంస్థలు ప్రశ్నిస్తాయని వారు హెచ్చరికలు చేసే ప్రయత్నం చేస్తున్నారా..? ఒక సీఎంను ప్రశ్నించగలిగినప్పుడు.. హోం మంత్రిని ఎందుకు ప్రశ్నించలేం..?’ అని అమిత్‌ షాను ఉద్దేశించి అన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో భాజపా మరోమారు అధికారంలోకి రాదని జోస్యం చెప్పారు. ఆ ఎన్నికల నిమిత్తం కమలం పార్టీకి వ్యతిరేకంగా విపక్షాలన్నీ ఐక్యం కావాలని పునరుద్ఘాటించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని