Amit Shah: సీబీఐ, ఈడీ దుర్వినియోగం ఆరోపణలపై స్పందించిన అమిత్ షా

దేశంలో స్వతంత్ర దర్యాప్తు సంస్థలైన సీబీఐ(CBI), ఈడీ(ED)లను కేంద్రం తన రాజకీయ ప్రత్యర్థులపై ఉసుగొల్పుతూ దుర్వినియోగానికి పాల్పడుతోందన్న ఆరోపణలపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా(Amit shah) స్పందించారు.

Published : 24 Nov 2022 21:07 IST

దిల్లీ: దేశంలో స్వతంత్ర దర్యాప్తు సంస్థలైన సీబీఐ(CBI), ఈడీ(ED)లను కేంద్రం తన రాజకీయ ప్రత్యర్థులపై ఉసుగొల్పుతూ దుర్వినియోగానికి పాల్పడుతోందన్న ఆరోపణలపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా(Amit shah) స్పందించారు. సీబీఐ, ఈడీలను దుర్వినియోగం చేస్తున్నట్టు ఎవరికైనా ఫిర్యాదులు ఉంటే కోర్టులను ఆశ్రయించవచ్చని సూచించారు. అంతేగానీ రాజకీయ రంగు పులుముకొని చూడరాదన్నారు. గురువారం దిల్లీలో ఓ మీడియా సంస్థ నిర్వహించిన ఈవెంట్‌లో పాల్గొన్న ఆయన పలు అంశాలపై మాట్లాడారు. దేశ రాజధాని నగరంలో ఇటీవల సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్‌ హత్యోదంతంపైనా స్పందించారు. సహజీవన భాగస్వామి శ్రద్ధా వాకర్‌ను అత్యంత దారుణంగా హత్య చేసిన కేసులో ఆమె ప్రియుడు అఫ్తాబ్‌కు దిల్లీ పోలీసులు, ప్రాసిక్యూషన్‌ కఠిన శిక్ష పడేలా చూస్తారన్నారు. మన దేశ ప్రజాస్వామిక విలువలు ప్రపంచానికి తెలిసే సమయం ఆసన్నమైందన్నారు.

2025 నాటికి 5ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని సాధించే దిశగా వేగంగా ముందుకు కదులుతున్నట్టు అమిత్‌ షా చెప్పారు. 2014లో మన దేశంలో కేవలం నాలుగు యూనికార్న్‌ స్టార్టప్‌లు మాత్రమే ఉండగా.. ఇప్పుడు అవి 100కి పైనే ఉన్నాయన్నారు. జమ్మూకశ్మీర్‌లో లోతుగా పాతుకుపోయిన ఉగ్రవాద మూలాల్ని నిర్మూలించేందుకు కేంద్రం కట్టుబడి ఉందన్నారు. ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేసేందుకు భాజపా కట్టుబడి ఉందని.. కానీ అది చర్చల తర్వాతేనన్నారు. గుజరాత్‌లో పోటీ భాజపా, కాంగ్రెస్‌ మధ్యే ఉంటుందని.. ఈ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో సీట్లు, ఓట్లతో తాము విజయం సాధిస్తామని ధీమా వ్యక్తంచేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని