Amit Shah: ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ వ్యాఖ్యల వేళ.. మణిపుర్‌ పరిస్థితులపై అమిత్‌ షా సమీక్ష

మణిపుర్‌లోని శాంతిభద్రతల పరిస్థితులను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా సోమవారం సమీక్షించారు.

Published : 17 Jun 2024 22:11 IST

దిల్లీ: జాతుల మధ్య ఘర్షణలతో మణిపుర్‌ (Manipur) అట్టుడికిన విషయం తెలిసిందే. ఇటీవల ఇంఫాల్‌, జిరిబామ్‌లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. హింస చెలరేగి ఏడాది పూర్తయినా ఇప్పటికీ ఆ రాష్ట్రంలో శాంతి నెలకొనలేదని ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ సైతం ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిణామాల నడుమ మణిపుర్‌లోని శాంతిభద్రతల పరిస్థితులను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా (Amit Shah) సమీక్షించారు. రాష్ట్రంలో జాతులపరంగా విభజనను రూపుమాపేందుకు కేంద్ర హోంశాఖ త్వరలోనే మైతేయ్‌, కుకీ ప్రజలతో సమావేశమవుతుందని సోమవారం నిర్వహించిన అత్యున్నత స్థాయి సమావేశంలో తెలిపారు.

ఇటీవల జిరిబామ్‌ జిల్లాలో మిలిటెంట్లు రెండు పోలీస్‌ అవుట్‌ పోస్టులు, ఫారెస్టు బీట్‌ కార్యాలయంతోపాటు స్థానికుల 70 ఇళ్లను తగలబెట్టారు. కాంగ్‌పోక్పి జిల్లాలో సీఎం భద్రత కాన్వాయ్‌పై సాయుధులు కాల్పులు జరిపారు. అయితే.. ఏడాది కాలంగా శాంతియుతంగా ఉన్న జిరిబామ్ వంటి కొత్త ప్రాంతాలకు హింస వ్యాప్తిచెందడంపై కేంద్రం ఆందోళన వ్యక్తం చేసినట్లు సంబంధిత వర్గాలు చెప్పాయి. తాజా ఘటనలు వెలుగుచూసిన ప్రాంతాల్లో అవసరమైన మేర బలగాలను మోహరించినట్లు అధికారులు కేంద్ర మంత్రి అమిత్‌ షాకు చెప్పారు. మణిపుర్‌ గవర్నర్‌ అనుసూయ ఉయికే దిల్లీలో ఆయన్ను కలిసిన మరుసటి రోజే ఈ సమీక్ష జరిగింది. దీనికి ముఖ్యమంత్రి బీరేన్‌ సింగ్‌ గైర్హాజరయ్యారు.

ఏడాదైనా మణిపుర్‌లో శాంతిలేదు

మణిపుర్‌ పరిస్థితులపై ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ ఇటీవల మాట్లాడుతూ.. అక్కడి పరిస్థితులను పట్టించుకోవాలని, హింసను అరికట్టాలని కోరారు. ఏడాది కాలంగా శాంతిస్థాపన కోసం ఆ రాష్ట్రం ఎదురుచూస్తోందని, ఈ సమస్యను ప్రాధాన్య అంశంగా పరిగణించి తగు చర్యలు తీసుకోవాలన్నారు. ఇదిలా ఉండగా.. గత ఏడాది మే 3న మణిపుర్‌లో మొదలైన జాతుల మధ్య ఘర్షణలు తీవ్ర హింసాత్మకంగా మారాయి. ఇప్పటివరకు దాదాపు 220 మందికిపైగా మృతి చెందారు. అంతకుముందు వరుస ఉగ్రదాడుల నేపథ్యంలో జమ్మూ-కశ్మీర్‌లోని పరిస్థితులపై అమిత్‌షా సమీక్ష నిర్వహించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని