Amit Shah: అందువల్లే నేను ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నా: అమిత్‌ షా

స్థానిక అధికార యంత్రాంగం మద్దతు లేకుండా దేశ సరిహద్దుల్లో చొరబాట్లు, స్మగ్లింగ్‌ వంటి కార్యకలాపాల్ని అడ్డుకోవడం అంత తేలిక కాదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు........

Published : 05 May 2022 17:06 IST

దిల్లీ: స్థానిక అధికార యంత్రాంగం మద్దతు లేకుండా దేశ సరిహద్దుల్లో చొరబాట్లు, స్మగ్లింగ్‌ వంటి కార్యకలాపాల్ని అడ్డుకోవడం అంత తేలిక కాదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర 24 పరగణాల జిల్లా హింగల్‌గంజ్‌లో మూడు తేలియాడే అవుట్‌ పోస్ట్‌(బీవోపీ)లను ఆయన ప్రారంభించారు. 2021లో బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల తర్వాత రెండు రోజుల పర్యటన కోసం తొలిసారి రాష్ట్రానికి విచ్చేసిన అమిత్‌ షా.. బీఎస్‌ఎఫ్‌ సీనియర్‌ అధికారులతో సమావేశమై మాట్లాడారు. అనంతరం హరిదాస్‌పుర్‌లో మైత్రి మ్యూజియానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. ‘‘ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం ప్రగతిమార్గంలో ముందుకెళ్తోంది. ఇందుకు కారణం సరిహద్దులు సురక్షితంగా ఉండటమే. జవాన్లు సరిహద్దుల్లో మకాం వేసి దేశాన్ని కాపాడుతున్నందునే హోంమంత్రిగా నేను ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నా. ఎంతో దైర్యసాహసాలు, అంకితభావం వల్లే బీఎస్‌ఎఫ్‌ ఇప్పటివరకు ఒక మహావీర చక్ర, నాలుగు కీర్తి చక్ర, 13 వీర చక్ర, 13 శౌర్య చక్ర పురస్కారాలు దక్కించుకుంది.’’ అన్నారు.

‘‘దేశ సరిహద్దుల్ని కాపాడటం కోసం ఎందరో బీఎస్‌ఎఫ్‌ జవాన్లు తమ అమూల్యమైన త్యాగాలు చేశారు. దేశ అంతర్గత, బహిర్గత భద్రతను అభేద్యంగా మార్చడమే మోదీ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. బీఎస్‌ఎఫ్‌కు ప్రపంచ స్థాయి అత్యాధునిక సాంకేతికతను అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యం. సట్లేజ్‌, కావేరి, నర్మదలలో ఈరోజు మూడు తేలియాడే బోర్డర్‌ అవుట్‌ పోస్టింగ్‌లను దేశానికి అంకితం చేస్తున్నాం. అత్యాధునిక వసతులతో వీటిని తీర్చిదిద్దాం. దేశ సరిహద్దుల్లో చొరబాట్లు, స్మగ్లింగ్‌ను దీటుగా అడ్డుకొనేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశాం. ఈ ప్రాంతంలో 80కి.మీల ప్రాంతం ఎంతో సవాల్‌తో కూడుకున్నది కానీ మన బీఎస్‌ఎఫ్‌ ధైర్య సాహసాలపై నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఈరోజు ఇక్కడ మైత్రి మ్యూజియానికి కూడా శంకుస్థాపన చేశాం. అలాగే, బీఎస్‌ఎఫ్‌లో ఇప్పుడు మహిళలు కూడా వచ్చి చేరారు. పురుషులతో భుజం భుజం కలిపి భారతమాతకు వారు కూడా సగర్వంగా సేవలందిస్తున్నారు. వారి సంరక్షణ కోసం ప్రత్యేక బ్యారక్‌లు ఏర్పాటు చేయడంతో పాటు అన్ని రకాల వసతులు కల్పనకు ఐదేళ్ల కార్యక్రమాన్ని రూపొందించాం’’ అని  తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని