Amit Shah: అక్కడ 50 భారీ చెరువులు తవ్వించాలి - అమిత్‌ షా

నదుల నీటి మట్టాల ముందస్తు అంచనాల వ్యవస్థను మెరుగుపరచుకోవాలని అన్ని రాష్ట్రాలకు అమిత్‌ షా సూచించారు.

Published : 24 Jun 2024 01:10 IST

దిల్లీ: వరదలను ఎదుర్కోవడంలో భాగంగా ఈశాన్య రాష్ట్రాల్లో 50 భారీ చెరువులను తవ్వించాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా ఆదేశించారు. తద్వారా బ్రహ్మపుత్ర వరదలను మళ్లించవచ్చన్నారు. వర్షాకాలం నేపథ్యంలో నీటి సంరక్షణ, వరదల సమన్నద్ధతపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన ఆయన.. అత్యాధునిక పర్యవేక్షణ వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఇందుకోసం ఇస్రో అందించే శాటిలైట్‌ చిత్రాలను సమర్థమంతంగా ఉపయోగించుకోవాలన్నారు.

నదుల నీటి మట్టాల ముందస్తు అంచనాల వ్యవస్థను మెరుగుపరచుకోవాలని అన్ని రాష్ట్రాలకు అమిత్‌ షా సూచించారు. డ్రైనేజీ వ్యవస్థను రోడ్డు రూపకల్పనలో అంతర్భాగంగా ఉంచుకోవాలన్నారు. వాతావరణం, వర్షపాతం, వరద హెచ్చరికలకు సంబంధించి వివిధ విభాగాలు రూపొందించిన యాప్‌లను ఒకే గొడుకు కిందకు తీసుకురావాలన్నారు. వరద నిర్వహణ కోసం జాతీయ విపత్తు ప్రతిస్పందన సంస్థ జారీచేసే సూచనలను అమలు చేయాలని అన్ని రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేేశించారు.

మరోవైపు వరదల సమస్యను ఎదుర్కొనేందుకు ఈశాన్య రాష్ట్రాల్లో 50 భారీ చెరువులను తవ్వి నీటిని నిల్వ చేయడం ద్వారా బ్రహ్మపుత్ర వరదలను మళ్లించవచ్చన్నారు. వ్యవసాయం, నీటిపారుదల, పర్యటకాన్ని అభివృద్ధి పరచుకునేందుకు దోహదం చేస్తుందన్నారు. సిక్కిం, మణిపుర్‌లలో వరదలపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని జల్‌శక్తి మంత్రిత్వశాఖ, జాతీయ విపత్తు నిర్వహణ సంస్థను ఆదేశించారు. విపత్తు నిర్వహణలో మరణాలు లేని విధానానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

వర్షాకాలం వచ్చిందంటే చాలు బ్రహ్మపుత్ర వరదలతో అస్సాంతో సహా ఈశాన్య రాష్ట్రాలు తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొంటుంటాయి. ప్రాణనష్టంతోపాటు వేల హెక్టార్లలో పంట కూడా దెబ్బతింటుంది.ఎంతోమంది నిరాశ్రయులవుతుండటమే కాకుండా రోడ్డు, సమాచార వ్యవస్థ దెబ్బతింటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు