Most Expensive Art: ‘చిత్రం చెప్పిన కథ’కు రూ.61కోట్లు.. ఆ అద్భుతాన్ని చూడండి..!

కొంతమంది మహిళలు ఆరుబయట కూర్చుని కబుర్లలో మునిగిపోయారు. వారి పక్కనే ఆవులు, పెంపుడు శునకం ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో కన్పించే ఈ దృశ్యాన్ని ఓ కళాకారిణి తన కుంచెతో అద్భుతంగా మార్చింది. అది ఇప్పుడు రూ.కోట్లు పలికింది. ఆ అద్భుతాన్ని మీరూ చూసేయండి..!

Published : 18 Sep 2023 17:31 IST

దిల్లీ: ప్రముఖ ఆర్టిస్ట్‌ అమృతా షెర్గిల్‌ (Amrita Sher-gil) కుంచె నుంచి జాలువారిన ఓ అద్భుత కళాఖండం (Painting) అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. 1937లో గీసిన ఈ ఆయిల్‌ పెయింటింగ్‌ వేలంలో ఏకంగా రూ.61కోట్లు పలికింది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఖరీదైన భారతీయ కళాకృతి ఇదే కావడం విశేషం.

ఆ కళాఖండం పేరు ‘ది స్టోరీ టెల్లర్‌ (The Story teller)’. ప్రాచీన కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉండే మహిళల జీవన విధానం ఉట్టిపడేలా అమృతా షెర్గిల్‌ ఆ పెయింటింగ్‌ను తీర్చిదిద్దారు. తొలిసారి 1937లో లాహోర్‌లో జరిగిన ఓ సోలో ఎగ్జిబిషన్‌లో షెర్గిల్‌ ఈ కళాకృతిని ప్రదర్శించారు. తాజాగా శాఫ్రాన్‌ఆర్ట్‌ (Saffronart) అనే ఆక్షన్ హౌస్‌ ఈ పెయింటింగ్‌ను వేలం వేయగా.. రికార్డు స్థాయిలో రూ.61.8కోట్లు పలికింది.

గతవారం మరో ఆర్టిస్ట్‌ సయ్యద్‌ హైదర్‌ రాజా గీసిన ‘జెస్టేషన్‌ (గర్భాదారణ)’ కళాఖండం రూ.51.75కోట్లు పలకగా.. ఇప్పుడు ‘ది స్టోరీ టెల్లర్‌ (The Story teller)’ ఆ రికార్డును అధిగమించి వేలంలో అత్యంత ధర పలికిన భారతీయ కళాకృతిగా నిలిచింది. అమృతా షెర్గిల్‌తో పెయింటింగ్‌తో పాటు ఎంఎఫ్‌ హుస్సేన్‌, జామిని రాయ్‌, ఎఫ్‌ఎస్‌ సౌజా వంటి ప్రముఖ ఆర్టిస్టుల కళాకృతులను కూడా శాఫ్రాన్‌ఆర్ట్‌ వేలం వేసింది.

ఎవరీ అమృతా షెర్గిల్‌..

అమృతా షెర్గిల్‌ (Amrita Sher-gil) 1913 జనవరి 30న హంగేరీలోని బుడాపెస్ట్‌లో జన్మించారు. తండ్రి భారతీయుడు కాగా.. తల్లి హంగేరీ దేశస్థురాలు. కళలపై అమితమైన ఆసక్తి కలిగిన షెర్గిల్‌ ఐదేళ్ల వయసులోనే వాటర్‌కలర్స్‌తో పెయింటింగ్‌ వేయడం మొదలుపెట్టారు. తొలుత హంగేరీ సంప్రదాయంలో అనేక కాల్పనిక సంఘటలకు ఆమె కళారూపం ఇచ్చారు.

ఆ తర్వాత 1921లో షెర్గిల్‌ కుటుంబం భారత్‌కు తిరిగొచ్చి శిమ్లా (హిమాచల్‌ ప్రదేశ్‌)లో స్థిరపడింది. అప్పటినుంచి భారతీయ సంస్కృతులపై మక్కువ పెంచుకున్న ఆమె.. గ్రామీణ ప్రజల జీవితాలను దగ్గర్నుంచి చూసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే ‘ది స్టోరీ టెల్లర్‌’తో పాటు ‘థ్రి గర్ల్స్‌’, ‘విమెన్‌ ఆన్‌ ది చార్‌పాయి’, ‘హిల్‌ విమెన్‌’, ‘యంగ్‌ గర్ల్స్‌’ వంటి కళాకృతులను గీశారు. దురదృష్టవశాత్తూ 1941లో తన 28 ఏళ్ల వయసులోనే ఆమె కన్నుమూశారు. 1976లో భారత పురావస్తు విభాగం మన దేశంలోని తొమ్మిది మంది ‘నేషనల్ ఆర్ట్‌ ట్రెజర్‌’ ఆర్టిస్టుల్లో ఈమెను ఒకరిగా ప్రకటించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని