ఎంపీలుగా ప్రమాణం చేసిన అమృత్‌పాల్‌ సింగ్‌, ఇంజినీర్‌ రషీద్‌

వివిధ కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తున్న ఖలిస్థాన్‌ సానుభూతిపరుడు అమృత్‌పాల్‌ సింగ్‌, ఉగ్రనిధుల కేసు నిందితుడు ఇంజినీర్‌ రషీద్‌ శుక్రవారం ఎంపీలుగా ప్రమాణస్వీకారం చేశారు.

Updated : 05 Jul 2024 20:09 IST

దిల్లీ: ఖలిస్థాన్‌ సానుభూతిపరుడు, పంజాబ్‌లోని ఖడూర్‌ సాహిబ్‌ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికైన అమృత్‌పాల్‌ సింగ్‌(Amritpal Singh), ఉగ్రనిధుల కేసు నిందితుడు ఇంజినీర్‌ రషీద్‌(Engineer Rashid) శుక్రవారం ఎంపీలుగా ప్రమాణస్వీకారం చేశారు. లోక్‌సభకు ఎన్నికైన వీరు ఇరువురు ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేయడానికి పెరోల్‌పై బయటకు వచ్చారు.

శుక్రవారం ఉదయం కట్టుదిట్టమైన భద్రత నడుమ పోలీసులు వారిని పార్లమెంటుకు తీసుకు వచ్చారు. అనంతరం వారు ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అమృత్‌పాల్‌ సింగ్‌ పంజాబ్‌లోని ఖదూర్‌ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. కాగా ఇంజినీర్‌ రషీద్‌ జమ్మూ కశ్మీర్‌లోని బారాముల్లా నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు.

వారు వివిధ కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తున్న నేపథ్యంలో 18వ లోక్‌సభ సభ్యులుగా ఇతర ఎంపీలతో కలిసి ప్రమాణం చేయలేకపోయారు. దాంతో ప్రమాణ స్వీకారం చేయడం కోసం అమృత్‌పాల్‌కు అస్సాంలోని డిబ్రూగఢ్‌ కారాగారం నుంచి దిల్లీకి వెళ్లి, తిరిగి కారాగారానికి చేరుకునేందుకు పట్టే ప్రయాణ సమయంతో కలిపి నాలుగు రోజులపాటు పెరోల్‌ను కోర్టు ఇచ్చింది. రషీద్‌కు తిహాడ్‌ జైలు నుంచి పార్లమెంటుకు పట్టే ప్రయాణ సమయంతో కలిపి రెండు గంటల కస్టడీ పెరోల్‌ ఇచ్చింది. బయట ఉన్నప్పుడు వారు గానీ, వారి కుటుంబ సభ్యులు గానీ ఏ రూపంలోనూ మీడియా వద్ద ప్రకటనలు చేయకూడదని కోర్టు షరతులు విధించింది. 

ఉగ్ర కార్యకలాపాలకు నిధులు సమకూర్చారన్న అభియోగాలపై 2019 ఆగస్టులో ఇంజినీర్‌ రషీద్‌ అరెస్టయ్యారు. ప్రస్తుతం ఆయన దిల్లీలోని తిహాడ్‌ జైల్లో ఉన్నారు. ‘వారిస్‌ పంజాబ్‌ దే’ అధిపతి అయిన అమృత్‌పాల్‌ సింగ్‌ తన అనుచరుడిని పోలీసు కస్టడీ నుంచి విడిపించుకునే ప్రయత్నంలో ఆయుధాలతో దాడి చేసినందుకు ఫిబ్రవరి 23న అరెస్టై జైల్లో ఉన్న విషయం తెలిసిందే. దీనికి గాను అమృత్‌ పాల్‌ అస్సాంలోని డిబ్రూగఢ్‌ కారాగారంలో శిక్ష అనుభవిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని