Amritpal Singh: 100 కార్లతో ఛేజ్‌ చేసి.. అమృత్‌పాల్‌ సింగ్‌ అరెస్టు..!

పంజాబ్‌లో తీవ్ర అల్లర్లకు కారణమైన అమృత్‌పాల్‌ సింగ్‌ (Amritpal Singh)ను పోలీసులు పక్కా వ్యూహంతో అరెస్టు చేశారు. సినీ ఫక్కీలో 100 కార్లలో వెంబడించి అతడిని అదుపులోకి తీసుకున్నారు.

Updated : 18 Mar 2023 17:45 IST

చండీగఢ్‌: ఖలిస్థానీ సానుభూతిపరుడు, ‘వారిస్‌ పంజాబ్‌ దే’ నాయకుడు అమృత్‌పాల్‌ సింగ్‌ (Amritpal Singh)ను ఆ రాష్ట్ర పోలీసులు (Punjab Police) శనివారం అరెస్టు చేశారు. 100 కార్లతో ఛేజ్‌ చేసి మరీ అతడిని అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. అతడితో పాటు ఆరుగురు మద్దతుదారులను కూడా అరెస్టు చేశారు. దీంతో పంజాబ్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ఖలిస్థానీ సానుభూతిపరుడు (Khalistan sympathiser) అమృత్‌పాల్‌ సింగ్‌కు అత్యంత సన్నిహితుడైన లవ్‌ప్రీత్‌ సింగ్‌ అలియాస్‌ తూఫాన్‌ సింగ్‌ను ఇటీవల పంజాబ్‌ పోలీసులు ఓ కిడ్నాప్‌ కేసులో అరెస్టు చేశారు. దాన్ని వ్యతిరేకిస్తూ అమృత్‌పాల్‌ పిలుపు మేరకు ఫిబ్రవరి 24న పెద్ద సంఖ్యలో యువత అమృత్‌సర్‌ జిల్లాలోని అజ్‌నాలా పోలీస్‌స్టేషన్‌పై దాడికి తెగబడ్డారు. నిరసనకారులు బీభత్సం సృష్టించడంతో పోలీసులు మరో దారిలేక లవ్‌ప్రీత్‌ను విడిచిపెట్టాల్సి వచ్చింది. అప్పట్లో ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో అప్రమత్తమైన రాష్ట్ర యంత్రాంగం అల్లర్లు జరిగేలా యువతను రెచ్చగొట్టాడన్న ఆరోపణలపై అమృత్‌పాల్‌పై కేసు నమోదు చేసింది. అయితే జీ-20 సదస్సు దృష్ట్యా ఇన్నాళ్లూ అతడిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

జీ-20 సదస్సు ముగిసన మరుసటి రోజే అమృత్‌పాల్‌ (Amritpal Singh) అరెస్టుకు పోలీసులు నేడు వ్యూహాన్ని అమలు చేశారు. జలంధర్‌లోని షాకోట్‌కు అతడు వస్తున్నట్లు అధికారులకు సమాచారం అందడంతో పక్కా ప్రణాళిక ప్రకారం అమృత్‌పాల్‌, అతడి అనుచరులను చుట్టుముట్టారు. పోలీసులు అరెస్టు చేసేందుకు వస్తున్నారని తెలియగానే అతడు పారిపోయేందుకు యత్నించాడు. దీంతో ప్రత్యేక పోలీసుల బృందం 100 కార్లలో అతడిని ఛేజ్‌ చేసింది. జిల్లా సరిహద్దులను మూసేసింది. కొన్ని గంటల పాటు వెంబడించి చివరకు జలంధర్‌లోని నాకోదార్‌ ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి.

అంతకుముందు అతడి ఆరుగురు అనుచరులను కూడా అరెస్టు చేశారు. ఈ అరెస్టుతో ఎలాంటి అల్లర్లు, అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. భారీగా పోలీసులు మోహరించారు. అమృత్‌సర్‌ సమీపంలోని జుల్లుపూర్‌ ఖేరా గ్రామంలో అమృత్‌పాల్‌ నివాసం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. పంజాబ్‌ వ్యాప్తంగా ఆదివారం మధ్యాహ్నం వరకు ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేశారు. అయితే అతడి అరెస్టుపై పోలీసులు అధికారిక ప్రకటన చేయలేదు.

ఎవరీ అమృత్‌పాల్‌ సింగ్‌..

ఇంజినీరింగ్‌ చదివిన 29 ఏళ్ల అమృత్‌పాల్‌ సింగ్‌ (Amritpal Singh) సిక్కులకు ప్రత్యేక దేశం కోరుతూ ఖలిస్థాన్‌ నినాదాలతో పంజాబ్‌ యువతను ప్రభావితం చేస్తున్నాడు. 2022 ఫిబ్రవరి వరకు అతడు ఎవరికీ తెలియని ఓ సాధారణ వ్యక్తి మాత్రమే. ఆధునిక జీవనశైలిని అనుసరిస్తూ కనీసం తలపాగా కూడా ధరించేవాడు కాదు. తన బంధువుల రవాణా వ్యాపారంలో మద్దతుగా ఉండేందుకు దుబాయిలో నివశించాడు. సోషల్‌ మీడియాలో ఎక్కువ సమయం గడిపేవాడు. కానీ, ‘వారిస్‌ పంజాబ్‌ దే’ సంస్థ వ్యవస్థాపకుడు, యాక్టర్‌ దీప్‌సిద్ధూ మరణంతో  అమృత్‌పాల్‌ జీవితం ఒక్కసారిగా మారిపోయింది. సిద్ధూ అనుచరులకు మార్గదర్శకాలు చేసేవారు కరవైపోయారు. దీనిని అమృత్‌పాల్‌ తెలివిగా వాడుకొన్నాడు. ‘వారిస్‌ పంజాబ్‌ దే’కు తానే నాయకుడినని ప్రకటించుకొన్నాడు. తొలి రోజుల్లో సిద్ధూ కుటుంబీకులు ఇందుకు అంగీకరించలేదు. కానీ, అమృత్‌పాల్ మాత్రం పాపులర్‌ అయ్యాడు. ఖలీస్థానీ కార్యకలాపాలకు అమృత్‌పాల్‌.. పంజాబ్‌నే స్థావరంగా ఎంచుకోవడంతో ఖలిస్థానీ సానుభూతిపరులను ఆకర్షించి నాయకుడయ్యాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు