Amritpal Singh: 45 నిమిషాలు గురుద్వారాలో ఉండి.. ఫోన్ వాడి..!

ఖలిస్థానీ సానుభూతిపరుడు అమృత్‌పాల్‌ సింగ్‌(Amritpal Singh) కోసం పంజాబ్‌ పోలీసులు ముమ్మర వేట సాగిస్తున్నారు. అయితే శనివారం అతడు ఓ గురుద్వారాలో ఉన్నట్లు తెలిసింది. 

Updated : 22 Mar 2023 14:38 IST

చండీగఢ్‌: పరారీలో ఉన్న ఖలిస్థానీ సానుభూతిపరుడు అమృత్‌పాల్‌ సింగ్‌ (Amritpal Singh) శనివారం 45 నిమిషాలు ఓ గురుద్వారాలో గడిపినట్లు సమాచారం. నంగల్ అంబియన్ గురుద్వారాకు చెందిన గ్రంథి(పూజలు నిర్వహించేవారు), ఆయన భార్య మీడియాకు వెల్లడించిన వివరాల ప్రకారం.. ‘అమృత్‌ పాల్‌ శనివారం మధ్యాహ్నం ఒంటిగంటకు గురుద్వారాకు చేరుకున్నాడు. 1.45 గంటల వరకు మా దగ్గరే ఉన్నాడు. సాయంత్రం నాలుగు గంటల వరకు అతడి కోసం పోలీసులు వెతుకుతున్నట్లు మాకు తెలియదు. అమృత్‌పాల్‌(Amritpal Singh), నలుగురు సహచరులతో అక్కడికి వచ్చాడు. వారేదైనా గొడవ సృష్టించడానికి వచ్చారని భావించాం. తాము ఒక ప్రోగ్రామ్‌కు వెళ్తున్నామని, తమకు కొన్ని దుస్తులు కావాలని అడిగారు. మాకు ఆశ్చర్యమనిపించినా, మా కుమారుడి దుస్తులు ఇచ్చాం. తర్వాత మా ఫోన్ అడిగి తీసుకున్నారు. వారు వెళ్లడానికి ముందు దానిని తిరిగిచ్చేశారు. అలాగే వారు ధరించిన నీలం, కాషాయం రంగు తలపాగాను తీసేసి, వేరే తలపాగాలను ధరించారు’ అని వారు తెలిపారు. 

అమృత్‌పాల్‌ (Amritpal Singh) కోసం శనివారం పంజాబ్‌(Punjab) పోలీసులు పక్కా వ్యూహంతో ప్రత్యేక ఆపరేషన్‌ చేపట్టినప్పటికీ అతడు తప్పించుకున్న విషయం తెలిసిందే. పోలీసులు వచ్చినట్లు సమాచారం అందగానే తాను ప్రయాణిస్తున్న మెర్సిడెస్‌ వాహనాన్ని అమృత్‌పాల్‌ అక్కడే వదిలేసి బ్రెజా కారులో వేరే మార్గంలో ఉడాయించాడు. అతడు పరారైన దృశ్యాలు జలంధర్‌లోని టోల్‌ప్లాజా వద్ద రికార్డయ్యాయి. అమృత్‌పాల్‌ పరారయ్యేందుకు సహకరించిన నలుగురిని పంజాబ్‌ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. రూపు మార్చుకుని, నల్లని కళ్లద్దాలు ధరించి, ఓ బైకు వెనుక కూర్చొని నిందితుడు తప్పించుకున్నట్లు వారు తెలిపారు. నిందితుడిపై లుక్‌అవుట్‌ సర్క్యులర్‌ కూడా జారీ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని