షాకింగ్‌.. గోవాలో పర్యాటకులపై కత్తులతో దాడి.. సీఎం సీరియస్‌!

గోవా(Goa)లో బీచ్‌ సమీపంలో దిల్లీకి చెందిన ఓ కుటుంబంపై దుండగులు కత్తులతో దాడి చేసిన వీడియో వైరల్‌గా మారింది. 

Published : 13 Mar 2023 19:24 IST

పనాజీ: గోవా బీచ్‌ సమీపంలో ఇటీవల జరిగిన దారుణం వెలుగులోకి వచ్చింది. గోవా పర్యటనకు వెళ్లిన  దిల్లీకి చెందిన ఓ కుటుంబంపై కొందరు వ్యక్తులు కత్తులతో  దాడి చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అంజునా ప్రాంతంలోని ఓ రిసార్టు వద్ద జరిగిన దాడిలో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా.. మిగతా వారికి స్వల్పంగా గాయాలయ్యాయి. ఈ ఘటనపై బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  అంజునా ప్రాంతంలోని స్పాజియో లీజర్ రిసార్ట్‌లోకి వెళ్లిన పర్యాటకులకు అక్కడి సిబ్బందితో స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో వారు మేనేజర్‌కు ఫిర్యాదు చేయడంతో ఆయన చీవాట్లు పెట్టారు.  ఈ విషయాన్ని మనసులో పెట్టుకున్న నిందితుడు రోషన్‌.. ఆ కుటుంబం రిసార్టు నుంచి బయటకు వచ్చిన సమయంలో తన స్నేహితులతో కలిసి వారిపై పిడిగుద్దులు కురిపించడంతో పాటు కత్తులు, బెల్టులతో దాడి చేసినట్టు పోలీసులు వివరించారు.  ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన అశ్వినీకుమార్‌ చంద్రానీ(43) అనే వ్యక్తి తమపై ముఠా దాడి చేసిన వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశారు. అయితే, దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించి రిసార్టులో రిసెప్షనిస్టుగా పనిచేసే రోషన్‌తో పాటు మరో ముగ్గురిని అరెస్టు చేసినట్టు వెల్లడించారు. వీరంతా అంజునా ప్రాంతానికి చెందినవారిగా గుర్తించిన పోలీసులు.. మిగతా వారికోసం గాలిస్తున్నారు. 

షాక్‌కు గురిచేసింది.. సీఎం ప్రమోద్‌ సావంత్

ఈ ఘటనపై సీఎం ప్రమోద్‌ సావంత్‌ సీరియస్‌ అయ్యారు.  ఈ ఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. ఇలాంటి హింసాత్మక ఘటనల్ని సహించేది లేదన్నారు. పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్టు ట్విటర్‌లో తెలిపారు. ఇలాంటి సంఘ విద్రోహక శక్తులు రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నాయన్న ఆయన.. తాము కఠిన చర్యలు తీసుకొంటున్నామని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. ఈ ఘటనలో నిందితుల పట్ల పోలీసులు మెతకగా వ్యవహరించారంటూ బాధితుల నుంచి ఆరోపణలు రావడంతో దర్యాప్తు అధికారిపై ప్రాథమిక దర్యాప్తు ప్రారంభమైనట్టు సమాచారం. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు