Drone attack: ఆనంద్‌ మహీంద్రా కీలక సూచన

జమ్ముకశ్మీర్‌లో వరుసగా డ్రోన్ల కదలికలు కలకలం సృష్టిస్తున్నాయి. దాంతో ఈ దేశ భద్రత అంశంపై ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా కీలక సూచన చేశారు.

Updated : 30 Jun 2021 16:59 IST

దిల్లీ: జమ్ముకశ్మీర్‌లో వరుసగా డ్రోన్ల కదలికలు కలకలం సృష్టిస్తున్నాయి. దాంతో దేశ భద్రత అంశంపై ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా కీలక సూచన చేశారు. భవిష్యత్తులో డ్రోన్‌ దాడులను నివారించేందుకు ప్రత్యేకమైన డ్రోన్ వ్యవస్థను సమకూర్చుకోవాలని వెల్లడించారు. ఈ మేరకు ఆయన ట్విటర్‌ వేదికగా స్పందించారు. ‘‘యుద్ధ తంత్రాలు మారుతున్నాయి. ఈ తరహా డ్రోన్‌ దాడులను నివారించేందుకు పటిష్ఠమైన డ్రోన్ వ్యవస్థను సమకూర్చుకోవాల్సి ఉంది. అందుకోసం రక్షణ బడ్జెట్‌లో కేటాయింపులు పెంచాలి. మరింత సమర్థవంతమైన వ్యవస్థ కోసం..శత్రుదేశాలు, ఉగ్రవాదుల నుంచి ఆకాశమార్గాన వచ్చే దాడులను ఎదుర్కొనేందుకు  ఇజ్రాయెల్ ‘ఐరన్ డోమ్’ తరహా వ్యవస్థను మన దేశంలో ఏర్పాటు చేసేందుకు మనం దృష్టి సారించాలి’’ అని మహీంద్రా సూచించారు.

గత ఆదివారం తెల్లవారుజామున రెండు డ్రోన్లు జమ్ము వైమానిక స్థావరంలోకి ప్రవేశించి ఒక భవనంపై, పక్కనే ఉన్న ఖాళీ ప్రదేశంపై బాంబులు జారవిడిచిన సంగతి తెలిసిందే. ఆరు నిమిషాల వ్యవధిలో ఈ రెండు బాంబు పేలుళ్లు సంభవించాయి. ఆ తర్వాత కూడా రత్నచక్, కాలుచుక్ సైనిక ప్రాంతంపై రెండు డ్రోన్లు తిరిగాయి. తాజాగా బుధవారం అదే పరిస్థితి తలెత్తింది. జమ్ము సైనిక స్థావరాల సమీపంలో మరో మూడు డ్రోన్లను భద్రతా సిబ్బంది గుర్తించారు. ఇదిలా ఉండగా.. ఈ డ్రోన్ దాడి వెనుక లష్కరే తోయిబా హస్తం ఉండొచ్చని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. మన సైనిక స్థావరాలపై ఉగ్రవాదులు డ్రోన్లతో దాడులకు దిగడం ఇదే ప్రథమం కావడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని