Anand Mahindra: భారత్‌కు ఇది ఎంతో అవసరం.. వైరల్‌గా మారిన మహీంద్రా ట్వీట్‌

వ్యాపార దిగ్గజం ఆనంద్‌ మహీంద్రా దేశానికి అవసరమయ్యే ఓ ఉత్పత్తి గురించి తాజాగా ప్రస్తావించారు. విదేశాల్లో అందుబాటులో ఉన్న........

Published : 03 Aug 2022 16:13 IST

ముంబయి: నిత్యం ఆసక్తికర, స్ఫూర్తి రగిల్చే అంశాలను పంచుకుంటూ.. ప్రతిభగల వారిని ప్రోత్సహించే వ్యాపార దిగ్గజం ఆనంద్‌ మహీంద్రా (Anand Mahindra) ఎంతో మందికి స్ఫూర్తి. దాదాపు 10మిలియన్ల మంది ఆయన్ను అనుసరిస్తుండగా.. అనేకమంది ఆయన పోస్టు కోసం ఎదురుచూస్తూ ఉంటారు. కాగా తాజాగా ఆయన దేశానికి అవసరమయ్యే ఓ ఉత్పత్తి గురించి ప్రస్తావించారు. విదేశాల్లో అందుబాటులో ఉన్న ‘రోడ్డు ప్యాచ్‌’కు సంబంధించిన ఓ వీడియోను ట్విటర్‌లో షేర్‌ చేస్తూ.. ఈ ఉత్పత్తిని భారత్‌లోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

రహదారిపై పడిన గుంతలు, పగుళ్లను ‘రోడ్డు ప్యాచ్‌’లతో పూడుస్తూ అమెరికాకు చెందిన సంస్థ ‘అమెరికన్ రోడ్ ప్యాచ్’ రూపొందించిన ప్రకటనను మహీంద్రా పంచుకున్నారు. ఈ రోడ్‌ ప్యాచ్‌లు వాటర్‌ ప్రూఫ్‌ అని, గుంతలను మాయం చేస్తూ ఎక్కువకాలం మన్నికగా ఉంటాయని, మరమ్మతులకు ప్రత్యామ్నాయం అని ఆ ప్రకటన తెలియజేస్తోంది. ఆ యాడ్‌ను మహీంద్రా పంచుకుంటూ.. ‘‘ఈ ఉత్పత్తి భారతదేశానికి అవసరమైన ఓ ఆవిష్కరణ నేను అని విశ్వసిస్తున్నా. కొన్ని బిల్డింగ్/కన్‌స్ట్రక్షన్ మెటీరియల్ సంస్థలు దీనిని ఇక్కడ ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఉంది. లేదా ఆ సంస్థతో ఒప్పందం కుదుర్చుకొని ఇక్కడకు తీసుకురావాలి’’ అని పేర్కొన్నారు.

కాగా ఆయన ట్వీట్‌ వైరల్‌గా మారింది. ఇప్పటికే 270వేల మందికి పైగా వీక్షించారు. గుంతలు ప్రారంభ దశలో ఉండగానే ఇలాంటివి చేస్తే అవి భారీ గుంతలుగా మారకుండా ఉంటాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. వర్షాకాలంలో మరింత ఉపయుక్తంగా ఉంటాయని పేర్కొంటున్నారు. మహీంద్రా అభిప్రాయాన్ని అనేకమంది సమర్థిస్తుండగా.. కొంతమంది మాత్రం విభేదిస్తున్నారు. భారత రహదారులపై ఆ ప్యాచ్‌లు ప్రాక్టికల్‌గా పనిచేయవని అంటున్నారు. గుంత భారీగా ఉంటే దానిని బేస్, సబ్-బేస్ కోర్స్‌తో నింపాలని.. ఆ ప్యాచ్‌లు ఇక్కడ పనిచేయవని పేర్కొంటున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని