Anand Mahindra: మాతృదినోత్సవాన మాట నిలబెట్టుకున్న ఆనంద్‌ మహీంద్రా.. ఇడ్లీ అమ్మకు ఇల్లు

ఎనిమిది పదుల వయసులో రూపాయికే ఇడ్లీలు అమ్ముతూ పేదల ఆకలి తీరుస్తున్న ‘ఇడ్లీ బామ్మ’ కమలాత్తాళ్‌ గుర్తుంది కదా! త్వరలో ఆమెకు సొంత ఇల్లు నిర్మించి ఇస్తామని పారిశ్రామిక దిగ్గజం ఆనంద్‌ మహీంద్రా గతంలో ట్విటర్‌ వేదికగా...

Updated : 09 May 2022 03:42 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎనిమిది పదుల వయసులో రూపాయికే ఇడ్లీలు అమ్ముతూ పేదల ఆకలి తీరుస్తున్న ‘ఇడ్లీ బామ్మ’ కమలాత్తాళ్‌ గుర్తుంది కదా! త్వరలో ఆమెకు సొంత ఇల్లు నిర్మించి ఇస్తామని పారిశ్రామిక దిగ్గజం ఆనంద్‌ మహీంద్రా గతంలో ట్విటర్‌ వేదికగా ప్రకటించారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ.. మాతృదినోత్సవం రోజున ఆమెకు కొత్త ఇంటిని కానుకగా అందజేశారు. గృహ ప్రవేశానికి సంబంధించిన దృశ్యాలు, ఈ మేరకు గతంలో చేసిన ట్వీట్‌లు, ఇంటి నిర్మాణ పనులతో కూడిన వీడియోను ఆదివారం ట్విటర్‌లో పంచుకున్నారు. ‘మాతృ దినోత్సవం నాటికి ‘ఇడ్లీ అమ్మ’కు సొంత ఇంటిని బహుమతిగా అందించేందుకు సకాలంలో పనులు పూర్తి చేసిన మా బృందానికి కృతజ్ఞతలు. ఆమె.. నిస్వార్థం, దయ తదితర మాతృత్వ సద్గుణాల స్వరూపం. అమ్మకు, ఆమె పనికి మద్దతు ఇవ్వడం గొప్పగా భావిస్తున్నాం. అందరికీ హ్యాపీ మదర్స్‌ డే’ అని ట్వీట్‌ చేశారు.

తమిళనాడులోని వడివెలంపాలయం గ్రామానికి చెందిన కమలాత్తాళ్‌ 37 ఏళ్లుగా రూపాయికే నాలుగు ఇడ్లీలు అమ్ముతూ పేదల ఆకలి తీరుస్తోన్న విషయం తెలిసిందే. ఈ ఇడ్లీ బామ్మ గురించి 2019లో ఆనంద్‌ మహీంద్రా ట్వీట్‌ చేయడంతో అప్పట్లో ఆ కథనం వైరల్‌గా మారింది. ఈ క్రమంలో ఆమెకు సాయం చేయడానికి ముందుకొచ్చిన మహీంద్రా.. వంటగ్యాస్‌కు అయ్యే ఖర్చును భరిస్తామని చెప్పారు. మరో సందర్భంలో.. కమలాత్తాళ్‌కు త్వరలోనే కొత్త ఇంటిని నిర్మించబోతున్నట్లు వెల్లడించారు. నేటితో ఆ హామీని నెరవేర్చుకున్నారు. మరోవైపు.. మహీంద్రా దయాగుణంపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ‘మీకు సెల్యూట్‌. మమ్మల్ని ఎప్పుడూ ఇలాగే గర్వపడేలా చేయాల’ని ఓ నెటిజన్‌ స్పందించారు. మీలాంటి కుమారుడు అందరికి రావాలని ఒకరు ఆకాంక్షించారు. మదర్స్‌ డే రోజు ఇడ్లీ అమ్మ ఆశీస్సులు పొందడం.. దేవుడి ఆశీస్సులు పొందడం లాంటిదేనని మరొకరు కామెంట్‌ పెట్టారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని