Anand Mahindra: దివ్యాంగుడి పట్టుదలకు ముగ్ధుడైన ఆనంద్‌ మహీంద్రా.. సంస్థలో ఉద్యోగం ఆఫర్‌!

వ్యాపార దిగ్గజం ఆనంద్‌ మహీంద్రా సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటారన్న విషయం తెలిసిందే. ప్రతిభ చాటుకున్నవారితోపాటు ఇబ్బందుల్లో ఉన్నవారిని గుర్తించి.. అండగానూ నిలుస్తుంటారు. ఇదే క్రమంలో తాజాగా ఆయన మరోసారి పెద్ద మనసు చాటుకున్నారు...

Updated : 28 Dec 2021 09:56 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వ్యాపార దిగ్గజం ఆనంద్‌ మహీంద్రా సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటారన్న విషయం తెలిసిందే. ప్రతిభ చాటుకున్నవారితోపాటు ఇబ్బందుల్లో ఉన్నవారిని గుర్తించి.. అండగానూ నిలుస్తుంటారు. ఇదే క్రమంలో తాజాగా ఆయన మరోసారి పెద్ద మనసు చాటుకున్నారు. వైకల్యానికి వెరువక, రోజువారీ జీవనంలో దూసుకెళ్తోన్న ఓ దివ్యాంగుడి పట్టుదలకు ముగ్ధుడయిన ఆయన.. అంతటితో ఆగకుండా, అతనికి తన సంస్థలో ఉద్యోగాన్ని ఆఫర్‌ చేయడం విశేషం. ఆ వ్యక్తికి సంబంధించిన వీడియోను సోమవారం ట్వీట్‌ చేస్తూ.. ప్రశంసాపూర్వక వ్యాఖ్యలు చేశారు.

వీడియో చూస్తుంటే.. కాళ్లు, చేతులు సరిగా వృద్ధి చెందని ఓ వ్యక్తి.. తన లోపాలను అధిగమిస్తూ ఓ మోడిఫైడ్‌ వాహనాన్ని నడుపుతున్నట్లు కనిపిస్తోంది. ‘భార్య, ఇద్దరు చిన్న పిల్లలు, ముసలి తండ్రి ఉన్నారు. అందుకే సంపాదన కోసం బయటకు వెళ్తున్నా. అయిదేళ్లుగా వాహనాన్ని నడుపుతున్నా’ అంటూ అతను వీడియోలో చెప్పుకొచ్చాడు. ఇది కాస్త.. ఆనంద్‌ మహీంద్రా దృష్టికి వెళ్లడంతో ఆయన స్పందించారు.

‘ఈ రోజు నా టైమ్‌లైన్‌లో ఈ వీడియో కనిపించింది. ఇది ఎంత పాతదో, ఎక్కడ చిత్రీకరించారో తెలియదు. కానీ.. తన వైకల్యాన్ని ఎదుర్కోవడమే కాకుండా ఉన్నదాంతోనే కృతజ్ఞతా భావంతో మెలుగుతున్న ఈ వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయా’ అని ఆనంద్‌ రాసుకొచ్చారు. మహీంద్రా లాజిస్టిక్స్‌ సంస్థలోని ఓ ఉద్యోగికి ఈ ట్వీట్‌ను ట్యాగ్‌ చేస్తూ.. ఇతన్ని బిజినెస్ అసోసియేట్‌గా చేర్చగలరా?’ అని అడిగారు. ఈ ట్వీట్‌ కాస్త వైరల్‌గా మారడంతో.. నెట్టింట విశేష స్పందన వస్తోంది.

ఇప్పటివరకు ఈ వీడియో ట్వీట్‌కు 1.70 లక్షలకు పైగా వ్యూస్‌ వచ్చాయి. నెటిజన్లు సైతం ఆ దివ్యాంగుడిని ప్రశంసిస్తూ.. ఆనంద్‌ మహీంద్రా చొరవను కొనియాడుతున్నారు. ఓ నెటిజన్‌.. అతన్ని దిల్లీలోని మోహ్రౌలి ప్రాంతంలో చూసినట్లు కామెంట్‌ పెట్టాడు. ఇదిలా ఉండగా.. ఇటీవల మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి తుక్కుతో తయారు చేసిన వాహనాన్ని చూసి మెచ్చుకున్న మహీంద్రా.. అతనికి బొలెరో ఇస్తానంటూ ప్రకటించిన విషయం తెలిసిందే.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని