Viral Video: ‘అదో అద్భుతం..! అసలు ఎలా సాధ్యం?: ఆనంద్‌ మహీంద్రా ట్వీట్‌

15మంది స్వాతంత్ర్య సమరయోధుల చిత్రాలను ఏకకాలంలో పెయింటింగ్‌ వేసి తన అపూర్వమైన ప్రతిభను ప్రదర్శించిన నూర్జహాన్‌ అనే ఆర్టిస్ట్‌కు ఆనంద్‌ మహీంద్రా స్కాలర్‌షిప్‌ ఆఫర్‌ చేశారు. అయితే, ఈ వీడియోపై నెటిజన్లు ‘అదో మోసం’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Published : 28 Oct 2022 01:31 IST

ముంబయి: సృజనాత్మకత, ప్రతిభ ఏ రూపంలో ఉన్నా దాన్ని ప్రశంసిస్తూ మరింతగా ప్రోత్సహించే వ్యక్తుల్లో ముందు వరుసలో ఉంటారు ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా(Anand Mahindra). క్రియేటివ్‌ అంశాలతో పాటు స్ఫూర్తిదాయకమైన కథనాలు, వీడియోలను సోషల్‌ మీడియాలో అందరితో షేర్‌ చేసుకొనే ఈ పారిశ్రామిక దిగ్గజం.. తాజాగా ‘ఓ ఆర్టిస్ట్‌ ప్రతిభ’కు సంబంధించిన వీడియోను షేర్‌ చేశారు. 15మంది స్వాతంత్య్ర సమరయోధుల చిత్రాలను ఏకకాలంలో పెయింటింగ్‌ వేసి తన అపూర్వమైన ప్రతిభను ప్రదర్శించిన నూర్జహాన్‌ అనే ఆర్టిస్ట్‌కు స్కాలర్‌షిప్‌ ఆఫర్‌ చేశారు. ఈ వీడియోను షేర్‌ చేస్తూ అసలు ఇది ఎలా సాధ్యం.. అంటూ ఆశ్చర్యం వ్యక్తంచేశారు. ఆనంద్‌ మహేంద్రా ట్వీట్‌ చేసిన ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఇప్పటివరకు 5లక్షల మందికి పైగా వీక్షించారు. 

‘‘అసలు ఇది ఎలా సాధ్యం?? కచ్చితంగా ఆమె ఓ టాలెంటెడ్‌ ఆర్టిస్టే. కానీ ఒకేసారి 15 మంది స్వాతంత్య్ర సమరయోధుల చిత్రాలను గీయడం కళ మించి. అదో అద్భుతం! ఆమెకు దగ్గరలో ఉన్న వ్యక్తులు ఎవరైనా ఈ ఘనత గురించి నిర్ధారించగలరా?నిజమైతే, ఆమెను తప్పనిసరిగా ప్రోత్సహించాలి.  ఆమెకు స్కాలర్‌షిప్‌ ఇచ్చేందుకు, ఇతర సహకారం అందించడం  నాకు ఆనందంగా ఉంటుంది’’ అని పేర్కొన్నారు. 

అది మోసం అంటోన్న నెటిజన్లు

అయితే, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో నూర్జహాన్ చోటు దక్కించుకున్నారని వార్తలు వస్తున్నప్పటికీ అధికారిక ధ్రువీకరణ మాత్రం లేదు. అయితే, ఆమె పేరును గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌లో క్రాస్‌ చెక్‌ చేయగా. తానకు అలాంటి పేరు ఏదీ కనిపించలేదని ఓ యూట్యూబర్‌ తెలిపారు. కళాకారుడు ఒకేసారి 15 పెయింటింగ్స్‌ వేస్తున్నట్టు చూపించే ఈ వీడియో ప్రామాణికతను పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇది నిజమని నమ్మేవారి సంఖ్యను చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉందని ఒకరు కామెంట్‌ చేయగా.. వావ్‌ వాట్‌ ఏ ఎడిటింగ్‌ అని మరో యూజర్‌ పేర్కొన్నారు. అలాగే, ఇది టాలెంట్‌ కాదు. మోసం.భౌతికంగా సాధ్యం కానిది ఎవరూ సాధించలేరు. ఆ చిత్రాలు అప్పటికే ఉన్నాయని.. వాటిని కవర్‌ చేసి ఆతర్వాత వాటిని వెలికి తీసిందని మరో యూజర్‌ పేర్కొన్నాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని