Anand Mahindra: వాసుకిని మెచ్చుకున్న ఆనంద్ మహీంద్రా..!

ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా వాసుకిపై ప్రశంసలు కురిపించారు.

Updated : 10 Sep 2022 15:11 IST

ముంబయి: ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా వాసుకిపై ప్రశంసలు కురిపించారు. ఇంతకీ వాసుకి ఎవరనుకుంటున్నారా..? ఇదొక సరకు రవాణా రైలు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా భారత రైల్వే 3.5 కి.మీల పొడవైన గూడ్స్‌ రైలు ‘సూపర్ వాసుకి(Super Vasuki)’ ని విజయవంతంగా పరీక్షించింది. ఆ వీడియో మహీంద్రా దృష్టికి చేరింది. ‘అద్భుతం. భారత వృద్ధి గాథ వలే దీనిది కూడా నిరాటంక పయనమే’ అంటూ ట్వీట్ చేశారు. అలాగే రైలు దూసుకెళ్తోన్న దృశ్యాలను షేర్ చేశారు. 

ఆగ్నేయ మధ్య రైల్వే(SECR) జోన్‌ పరిధిలో.. ఛత్తీస్‌గఢ్‌లోని భిలాయ్‌ నుంచి కోర్బా వరకు ఈ సరకు రవాణా రైలు ప్రయాణించింది. ఐదు ఇంజిన్లు, 295 లోడెడ్ వ్యాగన్‌లతో మొత్తం 27 వేల టన్నుల బొగ్గును ఒకేసారి తరలించింది. ఒకే రైలులో ఇంత మొత్తంలో బొగ్గు రవాణా.. భారతీయ రైల్వే చరిత్రలో ఇదే మొదటిసారి. ప్రస్తుతం ఒక ట్రిప్‌లో 9000 టన్నుల బొగ్గును మోసుకెళ్లే రైల్వే రేక్‌(ఒక్కొక్కటి 100 టన్నులతో 90 వ్యాగన్లు)ల కంటే ఇది మూడు రెట్లు ఎక్కువ. ‘సూపర్ వాసుకి’ తరలించే బొగ్గుతో.. 3000 మెగావాట్ల పవర్ ప్లాంట్‌ను ఒక రోజు పూర్తిగా నడపొచ్చు. విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాల్లో బొగ్గు కొరతను నివారించేందుకు, డిమాండ్ సీజన్‌లో వీలైనంత ఎక్కువ బొగ్గు రవాణా చేసేందుకు ఈ పొడవైన సరకు రవాణా రైళ్లను వినియోగించాలని భావిస్తోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని