టూరిస్టుల ఎస్‌యూవీని లాగేసిన పులి.. వీడియో షేర్‌ చేసిన ఆనంద్‌ మహీంద్రా

సఫారీ పార్క్‌కు వెళ్లిన పర్యాటకుల వాహనాలకు ఎదురుగా పులులు, సింహాలు రావడం, వాటిపైకి ఎక్కి కూర్చోవడం వంటి ఘటనలు అప్పుడప్పుడు చూస్తుంటాం.

Updated : 01 Jan 2022 16:06 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సఫారీ పార్క్‌కు వెళ్లిన పర్యాటకుల వాహనాలకు ఎదురుగా పులులు, సింహాలు రావడం, వాటిపైకి ఎక్కి కూర్చోవడం వంటి ఘటనలు అప్పుడప్పుడు చూస్తుంటాం. కానీ ఇక్కడ ఓ పులి మాత్రం ఏకంగా టూరిస్టుల వాహనాన్ని తన నోటితో లాగేసింది. కర్ణాటకలోని ఓ జూ పార్క్‌లో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా ట్విటర్‌లో షేర్‌ చేశారు. 

ఆ వీడియోలో ఆగిఉన్న మహీంద్రా జైలో ఎస్‌యూవీకి వెనుకవైపు ఉన్న బంపర్‌ను ఓ పెద్ద పులి నోటితో పట్టుకుని వెనక్కి లాగుతూ కన్పించింది. ఆ సమయంలో వాహనం నిండా టూరిస్టులు కూడా ఉన్నారు. అక్కడే మరో కారులో వెళ్తున్న కొందరు టూరిస్టులు దీన్ని వీడియో తీశారు. గత కొద్ది రోజులుగా మెసేజింగ్‌ యాప్‌ సిగ్నల్‌లో ఈ వీడియో తెగ వైరల్‌ అయి ఆనంద్‌ మహీంద్రా దృష్టిలో పడింది. 

నిజానికి ఈ ఘటన గతేడాది జరిగినట్లు యశ్‌ షా అనే వ్యక్తి తెలిపారు. పులి లాగిన కారులో యశ్‌ కూడా ఉన్నారట. గతేడాది నవంబరులో బెంగళూరు సమీపంలోని బన్నెరుఘాట్‌ నేషనల్‌ పార్క్‌కు తాము వెళ్లామని, అయితే మధ్యలో తమ జైలో బ్రేక్‌డౌన్‌ అయ్యిందని ఆయన తెలిపారు. ఆ సమయంలోనే పులి అక్కడకు వచ్చి తమ కారును లాగినట్లు చెప్పారు. 

ఈ వీడియోను ఆనంద్‌ మహీంద్రా ట్విటర్‌లో షేర్‌ చేస్తూ తనదైన శైలిలో స్పందించారు. ‘‘ఈ వీడియో సిగ్నల్‌లో దావానలంగా వైరల్‌ అవుతోంది. ఆ కారు జైలో మోడల్‌. అందువల్ల పులి దాన్ని నోట కరుచుకోవడంలో నాకు ఏ మాత్రం ఆశ్చర్యం లేదు. మహీంద్రా కార్లు చాలా రుచికరంగా ఉంటాయి కదా..!’’ అంటూ నవ్వుతున్న ఎమోజీని జోడించారు మహీంద్రా. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోను మహీంద్రా నిన్న షేర్‌ చేయగా.. ఇప్పటికే 4లక్షల మందికి పైగా వీక్షించారు. ఈ పులికి చాలా బలం ఉందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కొందరైతే ఏ పేస్ట్‌ వాడుతోందో అని చమత్కరిస్తున్నారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని