Anand Mahindra: పాత జ్ఞాపకాలు.. తీపి గుర్తులు.. ఆనంద్‌ మహీంద్రా వీడియో వైరల్‌

మహీంద్రా సంస్థల అధినేత ఆనంద్‌ మహీంద్రా పాత కాలంలో ఇంట్లో ఉపయోగించే వస్తువులు, ప్రకటనలకు సంబంధించిన ఫొటోలతో రూపొందించిన వీడియోను ట్విటర్‌లో పోస్టు చేశారు. అది ప్రస్తుతం వైరల్‌గా మారింది.

Published : 06 Jan 2023 17:27 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సాంకేతికత (Technology) కొత్త పుంతలు తొక్కుతోంది. రేడియోలు (Radio), డయలర్‌ ఫోన్లు (Dailer phone), లాంతర్లు లాంటి వస్తువులెన్నో కనుమరుగైపోయాయి. వాటి స్థానంలో రకరకాల ఎలక్ట్రానిక్‌ పరికరాలు (Electronic Gadgets) అందుబాటులోకి వచ్చాయి. పాతకాలంనాటి వస్తువులు ఒకసారి మన కంటపడితే ఎంతో ఆశ్చర్యంగా చూస్తాం. గతంలో వాటిని వాడినవారు పాత జ్ఞాపకాల్లోకి వెళ్తే.. వాటి గురించి తెలియని వారు మాత్రం వాటిని వింతగా చూస్తూ.. అప్పట్లో  ఇలాంటి వస్తువులు వాడేవారా? అనుకుంటారు. సామాజిక మాధ్యమాల్లో ఎంతో చురుగ్గా ఉండే మహీంద్రా సంస్థల అధినేత ఆనంద్‌ మహీంద్రా (Anand Mahindra).. అలాంటి వస్తువుల ఫొటోలతో రూపొందించిన ఓ వీడియోను ట్విటర్‌లో పోస్టు చేశారు. ‘‘ఎంత అద్భుతమైన జీవన ప్రయాణం. ఎక్కడి నుంచి ఎక్కడికో ఎదిగిపోయాం. ఒకవేళ ఎవరైనా వీటన్నింటినీ ఫిజికల్‌గా సేకరించి, మ్యూజియంలో భద్రపరిస్తే ఎంత బాగుంటుందో కదా’’ అంటూ రాసుకొచ్చారు.

ఆ వీడియోలో.. 1980, 90ల్లో ఉపయోగించిన లాంతర్లు, పాతకాలం నాటి ఫోన్లు, వెస్పా స్కూటర్‌, గ్యాస్‌లైట్‌, అల్యూమినియంతో చేసిన టార్చిలైట్‌, కిరోసిన్‌ స్టవ్‌, కిరోసిన్‌ దీపం, బొగ్గుల ఇస్త్రీ పెట్టె, అలారం లాంటి వస్తువులెన్నో ఉన్నాయి. అంతేకాకుండా లక్స్‌ సబ్బు యాడ్‌లు అప్పట్లో ఎలా ఉండేవో చూపిస్తూ కొన్ని ఫొటోలను జతచేశారు. గతంలో ఎక్కువ మంది ఉపయోగించే చార్మినార్‌ సిగరెట్‌ పెట్టె కోసం చేసి ప్రకటనతోపాటు, వహీదా రెహ్మాన్‌, మధుబాల, పద్మినిల ఫిల్మ్‌ఫేర్‌ యాడ్స్‌ ఫొటోలు కూడా చూడొచ్చు. అమితాబ్‌ బచ్చన్‌ యువకుడిగా ఉన్నప్పుడు చేసిన  బాంబే డైయింగ్‌  ప్రకటనకు సంబంధించిన ఫొటోలను కూడా ఆ వీడియోలో జత చేశారు. ‘‘ ఎంతలా అభివృద్ధి చెందామో కదా.. ఇప్పటి తరాలు వీటిని చూస్తే నమ్మవేమో.. కానీ, ఇది కచ్చితంగా నిజం. ఈ ఫొటోలను చూస్తే నా రోమాలు నిక్కబొడుచుకున్నాయి. గత స్మృతుల్లోకి వెళ్లిపోయాను’’ అంటూ ఓ యూజర్‌ కామెంట్‌ చేశారు. ప్రస్తుతం వీడియో వైరల్‌గా మారింది.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని