‘మహారాష్ట్రలో అందరికీ టీకాలు ఇవ్వాలి’

దేశంలో గతకొన్ని రోజులుగా కరోనా కేసులు పైపైకి పోతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్రలో వైరస్ ఉద్ధృతి విపరీతంగా ఉంది. అక్కడ రోజువారీ కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో

Published : 16 Mar 2021 11:00 IST

కేంద్రాన్ని కోరిన ఆనంద్‌ మహీంద్రా

ముంబయి: దేశంలో గతకొన్ని రోజులుగా కరోనా కేసులు పైపైకి పోతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్రలో వైరస్ ఉద్ధృతి ఎక్కువగా ఉంది. అక్కడ రోజువారీ కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ‘మహా’లో కరోనా విజృంభణపై ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా ట్విటర్‌ వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ టీకాలు ఇచ్చేలా అత్యవసర అనుమతివ్వాలని కేంద్రాన్ని కోరారు.

‘‘దేశంలో నమోదవుతున్న రోజువారీ కొత్త కరోనా కేసుల్లో సగానికి పైగా ఒక్క మహారాష్ట్రలోనే ఉంటున్నాయి. దేశ ఆర్థిక కార్యకలాపాలకు ప్రధాన కేంద్రమైన రాష్ట్రాన్ని లాక్‌డౌన్లు బలహీనపరిచే అవకాశముంది. ఇలాంటి పరిస్థితుల దృష్ట్యా టీకా వేయించుకునేందుకు సిద్ధంగా ఉన్న ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్లు ఇచ్చేలా రాష్ట్రానికి అత్యవసర అనుమతులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. వ్యాక్సిన్ల కొరత కూడా ఉండకూడదు’’ అని మహీంద్రా ట్వీట్‌ చేశారు. ప్రధానమంత్రి కార్యాలయం, కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్‌ను ఆయన ట్యాగ్ చేశారు. 

ఈ ట్వీట్‌కు ఓ నెటిజన్‌ స్పందిస్తూ.. కేవలం వ్యాక్సినేషన్‌ పెంచితే సరిపోదని.. కరోనా పరీక్షలు, ట్రేసింగ్‌, చికిత్సలో వేగం పెంచాలని అన్నారు. దీంతో పాటు ప్రజలు క్రమశిక్షణగా ఉండటం ముఖ్యమని చెప్పారు. నెటిజన్‌ ట్వీట్‌కు మహీంద్రా బదులిస్తూ.. ‘‘అవును నేనూ ఇందుకు ఒప్పుకుంటాను. కానీ వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగంగా చేపట్టకపోతే మనం రెండు, మూడు, నాలుగో దశ కరోనా వ్యాప్తితో బాధపడాల్సి వస్తుంది’’ అని ఆందోళన వ్యక్తం చేశారు.

మహారాష్ట్రలో వైరస్‌ వ్యాప్తి పెరిగిన నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. నాగ్‌పూర్‌ సహా కొన్ని జిల్లాల్లో లాక్‌డౌన్‌ విధించింది. మరికొన్ని చోట్ల రాత్రిపూట కర్ఫ్యూ అమలు చేస్తోంది. ప్రజలందరూ తప్పనిసరిగా కరోనా నిబంధలను పాటించాలని, లేదంటే రాష్ట్రవ్యాప్తంగా పూర్తి లాక్‌డౌన్‌ విధించాల్సి వస్తోందని అక్కడి ప్రభుత్వం హెచ్చరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని