Anand Mahindra: ‘సండే సరదా.. ఆ విషయాన్ని నేను మర్చిపోతా’

ఆదివారం ఎలా ఎంజాయ్‌ చేస్తారు? అంటూ.. ఓ నెటిజన్‌ అడిగిన ప్రశ్నకు పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) చెప్పిన సమాధానం నెట్టింట వైరల్‌గా మారింది.

Updated : 26 Mar 2023 20:28 IST

ముంబయి: ప్రముఖ పారిశ్రామికవేత ఆనంద్‌ మహీంద్రా (Anand Mahindra) సోషల్‌ మీడియా (Social Media)లో ఎంతో చురుగ్గా ఉంటారు. వర్తమాన అంశాలతోపాటు హాస్యం పండించే దృశ్యాలు, స్ఫూర్తి నింపే వాక్యాలు వంటివి ఎన్నో నెట్టింట్లో షేర్ చేస్తుంటారు. ట్విటర్‌లో ఆయనకు సుమారు 10.4 మిలియన్‌ ఫాలోవర్లు ఉన్నారు. తాజాగా ఆదివారం సరదా గురించి ఆయన చెప్పిన మాటలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఓ వ్యక్తి తన వెనుక బ్యాగ్‌లో కూలింగ్ గ్లాస్‌ పెట్టుకున్న కుక్క పిల్లతో కలిసి బైక్‌పై ప్రయాణిస్తుంటాడు. ఈ వీడియోను మహీంద్రా షేర్‌ చేస్తూ.. ‘‘సండే ఫీలింగ్‌ గురించి చెప్పేందుకు ఇంతకంటే మంచి వీడియో ఏముంటుంది’’అని ట్వీట్‌ చేశారు. 

ఈ వీడియో చూసిన అభిషేక్‌ జైశ్వాల్‌ అనే నెటిజన్‌ ‘‘ మహీంద్రా సార్‌ మీకు నాదో ప్రశ్న. మీరు దేశంలోనే పెద్ద పారిశ్రామికవేత్త. ఆదివారాన్ని మీరు ఎలా ఎంజాయ్‌ చేస్తారు? ’’ అని అడిగాడు.  ఆనంద్‌ మహీంద్రా నెటిజన్‌ ప్రశ్నకు బదులిస్తూ..‘‘ఆదివారం సరదాగా గడిపేందుకు నా దగ్గర ఓ టెక్నిక్‌ ఉంది. దాన్నే నేను చాలా కాలంగా వాడుతున్నాను. ఆదివారం నేను పారిశ్రామికవేత్త అనే విషయాన్ని మర్చిపోతాను’’ అని బదులిచ్చారు. మహీంద్రా సమాధానం చూసిన నెటిజన్లు ఆయనకు మద్దతుగా కామెంట్లు చేస్తున్నారు. ‘‘ఆదివారాన్ని ఆస్వాదించాలంటే ఇదే సరైన ఎంపిక. లేదంటే వ్యాపారం, ఇతర సమస్యలు వాటిని పరిష్కరించే మార్గాల గురించి ఆలోచిస్తూ ఎంజాయ్‌ చేయడం మర్చిపోతాం’’ అని ఓ నెటిజన్‌ కామెంట్‌ చేయగా, ‘‘వ్యక్తిగతంగా మీరు ఎంతో సాధారణమైన వ్యక్తిలా ఆలోచిస్తారనేందుకు ఇదే చక్కటి ఉదాహరణ’’ అని మరో నెటిజన్‌ కామెంట్‌ చేశారు. పారిశ్రామికవేత్తలకు వీకెండ్‌ సరదాలుంటాయా అని మరో నెటిజన్‌ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశాడు. 




Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని