Anand Mahindra: ‘ఆ క్షణం నా కళ్లలో నీళ్లు తిరిగాయి’.. చిన్నారిపై ఆనంద్‌ మహీంద్రా ప్రశంసలు

‘అమెరికా గాట్‌ టాలెంట్‌’ షోలో భారత సంతతికి చెందిన తొమ్మిదేళ్ల చిన్నారి తన గానంతో గోల్డెన్‌ బజర్‌ను గెలుచుకొంది. దీనిపై స్పందించిన ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా ఆమె ప్రతిభపై ప్రశంసలు కురిపించారు.

Updated : 08 Jul 2024 19:06 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నిత్యం స్ఫూర్తిమంతమైన కథనాలను పంచుకుంటూ సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా (Anand Mahindra) ‘ఎక్స్‌’ ఖాతాలో తాజాగా మరో వీడియోను పంచుకున్నారు. అమెరికాలో జరిగిన ఓ టాలెంట్‌ షోలో భారత సంతతికి చెందిన చిన్నారి తన ప్రతిభతో అందర్నీ ఆకట్టుకోవడంపై ప్రశంసలు కురిపించారు. ఆమె తన గానంతో న్యాయనిర్ణేతలు సహా ఎంతోమందిని మంత్రముగ్ధుల్ని చేసింది.

భారత సంతతికి చెందిన ప్రణిస్కా మిశ్రాకు తొమ్మిదేళ్లు. కుటుంబం ఫ్లోరిడాలో స్థిరపడింది. ఇటీవల ‘అమెరికాస్‌ గాట్‌ టాలెంట్‌’ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె.. న్యాయనిర్ణేతలు అడిగిన ప్రశ్నలకు చురుగ్గా సమాధానం చెప్పింది. తాను ఇక్కడి వరకు వచ్చేందుకు అమ్మమ్మ ఎంతో ప్రోత్సాహం అందించినట్లు తెలిపింది. అనంతరం తన పాటతో అక్కడున్న వారందరినీ ఆశ్చర్యపరిచింది. ‘గోల్డెన్‌ బజర్‌’ను సొంతం చేసుకొని ఔరా అనిపించింది.

నెలసరి సెలవులు మంచిదే కానీ..: సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

న్యాయ నిర్ణేతలు వీడియో కాల్‌ ద్వారా చిన్నారి అమ్మమ్మతో మాట్లాడారు. మనవరాలు సాధించిన ఈ విజయంతో ఆమె కళ్లు ఆనంద బాష్పాలతో నిండిపోయాయి. దీనికి సంబంధించిన వీడియోను పంచుకున్న ఆనంద్‌ మహీంద్రా చిన్నారిపై ప్రశంసల జల్లు కురిపించారు.

ఆమె అద్భుతం చేసింది..

‘‘అమెరికాస్‌ గాట్ టాలెంట్‌ వేదికపై భారత సంతతికి చెందిన చిన్నారి అద్భుతం చేసింది. అమెరికా సంగీత శైలిలో అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఆమె తన అమ్మమ్మతో మాట్లాడే సమయంలో నా కళ్లలో నీళ్లు తిరిగాయి’’ అని మహీంద్రా పేర్కొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని