Anant Ambani Wedding: అంబానీల ఇంట పెళ్లి భోజనాలు.. మెనూలో ఇవి!

అనంత్‌ అంబానీ-రాధిక మర్చంట్‌ వివాహ వేడుకలో అతిథులకు పెట్టే భోజనాల మెనూ కొంత బయటకి వచ్చింది.

Updated : 09 Jul 2024 17:36 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అపర కుబేరుడు ముకేశ్‌ అంబానీ (Mukesh Ambani) ఇంట పెళ్లి వేడుక అంటే అందరికీ ఆసక్తే. పెళ్లి పత్రిక నుంచి వివాహ వేదిక, వారు ధరించే దుస్తులు, అతిథులకు వడ్డించే భోజనాలు..  ఇలా అన్నీ ప్రత్యేకమే. ముకేశ్‌ అంబానీ చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ (Anant Ambani), రాధిక మర్చెంట్‌ల (Radhika Merchant) నిశ్చితార్థం మొదలు ప్రీ వెడ్డింగ్‌ వేడుకల వరకు ఆ ఇంట్లో జరిగే ప్రతీ కార్యక్రమం ఆకట్టుకుంటోంది. మార్చిలో నిర్వహించిన ప్రీ వెడ్డింగ్‌ కార్యక్రమంలో ఆహ్వానితులకు దాదాపు 2,500 రకాల వంటకాలతో విందు భోజనాలు పెట్టారు. అప్పుడే ఇన్ని రకాల వంటకాలతో భోజనాలు పెడితే.. పెళ్లికి ఇంకెన్ని రకాల వంటలు ఉంటాయోనన్న ఆసక్తి పెరుగుతోంది.

జులై 12న జరగబోయే పెళ్లి భోజనాలకు సంబంధించిన మొత్తం మెనూ తెలియదు గానీ, కొంత మాత్రం బయటకి వచ్చింది. వారణాశిలో ప్రసిద్ధి చెందిన ‘కాశీ చాట్ బండార్‌’ స్టాల్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఆ చాట్‌ బండార్‌ యజమానే స్వయంగా ముఖ్య అతిథులకు వడ్డించనున్నారు. టిక్కీ, టమాటా చాట్‌, పాలక్‌ చాట్‌, చనా కచోరి, దహీ పూరి, బనారస్‌ చాట్‌, కుల్ఫీ, ఫలూదా తదితర ఆహార పదార్థాలను అతిథుల కోసం తయారుచేయనున్నారు. వీటిని ముకేశ్‌ అంబానీ సతీమణి నీతా అంబానీయే స్వయంగా ఎంపిక చేశారట.  జూన్‌ 24న పెళ్లి పత్రిక తీసుకొని నీతా అంబానీ.. కాశీ విశ్వేశ్వరుడి దర్శనానికి వెళ్లిన సంగతి తెలిసిందే. మార్గమధ్యంలో ఆ చాట్‌ బండార్‌కు వెళ్లి.. అక్కడి పదార్థాలను రుచి చూశారట. యజమాని కేసరితో మాట్లాడి.. తన కుమారుడి పెళ్లిలో ఈ వంటకాలు పెట్టాలని కోరారట. దీనికి తాను అంగీకరించినట్లు కేసరి తాజాగా ఓ జాతీయ మీడియాకు తెలిపారు.

పారిశ్రామికవేత్త వీరెన్‌ మర్చెంట్‌ కుమార్తె రాధికతో అనంత్‌ అంబానీ వివాహం జులై 12న జరగనున్న సంగతి తెలిసిందే. ముంబయిలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని జియో వరల్డ్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ ఇందుకు వేదిక కానుంది. మూడు రోజుల పాటు పెళ్లి వేడుకలు జరగనున్నాయి. జులై 12న ముఖ్య ఘట్టమైన ‘శుభ్‌ వివాహ్‌’తో మొదలయ్యే ఈ సెలబ్రేషన్స్‌.. జులై 13న ‘శుభ్‌ ఆశీర్వాద్‌’, జులై 14న ‘మంగళ్‌ ఉత్సవ్‌’తో ముగుస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని