Anant Radhika Engagement: అంబానీ ఇంట పెళ్లి సందడి.. వేడుకగా అనంత్‌, రాధిక నిశ్చితార్థం

అంబానీల వారసుడు అనంత్‌ అంబానీ, రాధిక నిశ్చితార్థం వేడుకగా జరిగింది. ఇరు కుటుంబాలకు చెందిన బంధువులు, స్నేహితులు ఈ వేడుకకు హాజరయ్యారు.

Published : 20 Jan 2023 01:49 IST

ముంబయి: అంబానీల ఇంట పెళ్లి సందడి మొదలైంది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ, నీతా అంబానీల తనయుడు అనంత్‌ అంబానీకి (Anant Ambani) విరెన్‌ మర్చంట్‌, శైల దంపతుల కుమార్తె రాధికా  మర్చంట్‌ (Radhika marchant) నిశ్చితార్థం గురువారం అంగరంగ వైభవంగా జరిగింది. ఇరు కుటుంబాలకు చెందిన బంధువులు, స్నేహితులు ఈ వేడుకకు హాజరయ్యారు. ముంబయిలోని అంబానీల నివాసం ఈ వేడుకకు వేదికైంది. గుజరాతీ హిందూ కుటుంబ సంప్రదాయాలను అడుగడుగునా పాటించారు.

తొలుత అనంత్‌ సోదరి ఈషా అంబానీ మర్చంట్‌ ఇంటికి వెళ్లి వారిని వేడుకకు ఆహ్వానించడంతో నిశ్చితార్థ వేడుక ప్రారంభమైంది. సాయంత్రం అంబానీ నివాసానికి చేరిన మర్చంట్‌ కుటుంబానికి అంబానీ కుటుంబ సభ్యులు ఘన స్వాగతం పలికారు. తొలుత శ్రీకృష్ణ మందిరంలో ఇరువురు కుటుంబ సభ్యుల ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం నిశ్చితార్థ వేదికపైకి చేరుకున్నారు. గణపతి ఆరాధనతో కార్యక్రమాన్ని ప్రారంభించాక వివాహ ఆహ్వాన పత్రికను అందరికీ చదివి వినిపించారు. గుజరాతీ సంప్రదాయాలైన  గోల్‌ధన, చునారి విధి కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఇరు కుటుంబ సభ్యులు బహుమతులు ఇచ్చిపుచ్చుకున్నారు. ఈ సందర్భంగా నీతా అంబానీ నేతృత్వంలో అంబానీ కుటుంబం చేసిన నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అనంతరం కుటుంబ సభ్యుల సమక్షంలో అనంత్‌, రాధిక  ఉంగరాలు మార్చుకున్నారు. పెద్దల ఆశీర్వాదం తీసుకున్నారు. మరికొన్ని నెలల్లో వీరి వివాహం జరగనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని