Bihar: డీజే వివాదంతో పోలీస్‌ స్టేషన్‌కు నిప్పు పెట్టేశారు..!

బిహార్‌లోని పశ్చిమ చంపారన్‌ జిల్లా బెతియాలో హోలీ సందర్భంగా ఏర్పాటు చేసిన డీజేతో తలెత్తిన వివాదం.. స్థానిక యువకుడు, కానిస్టేబుల్ మరణానికి కారణమైంది.

Published : 20 Mar 2022 11:44 IST

పట్నా: బిహార్‌లోని పశ్చిమ చంపారన్‌ జిల్లా బెతియాలో హోలీ సందర్భంగా ఏర్పాటు చేసిన డీజేతో తలెత్తిన వివాదం.. స్థానిక యువకుడు, కానిస్టేబుల్ మరణానికి కారణమైంది. బెతియా సమీపంలోని ఆజ్రానగర్‌ గ్రామంలో హోలీ రోజు స్థానికులు డీజే ఏర్పాటు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు డీజే ఏర్పాటుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామానికి చెందిన అనిరుధ్‌ యాదవ్‌ అనే యువకుడిని స్టేషన్‌కు తీసుకెళ్లారు. అనంతరం ఆ యువకుడు బాల్‌థార్‌ స్టేషన్‌ ఆవరణలోనే మరణించాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన వందలాది గ్రామస్థులు.. పోలీస్‌ స్టేషన్‌ను చుట్టుముట్టి వాహనాలకు నిప్పు పెట్టారు. కొందరు తుపాకులు పేల్చడంతో.. తూటా తగిలి ఓ కానిస్టేబుల్‌ ప్రాణాలు కోల్పోయారు. తర్వాత యువకుడి మృతదేహాన్ని పోలీసు జీపుపై ఉంచిన గ్రామస్థులు.. ధర్నాకు దిగారు. పోలీసులు కొట్టడం వల్లే యువకుడు మృతిచెందినట్టు ఆరోపించారు. బెతియా, బాల్‌థార్‌ రహదారిని దిగ్బంధించారు. పరిస్థితి అదుపుతప్పడంతో పశ్చిమ చంపారన్‌ ఎస్పీ ఉపేంద్రనాథ్‌ వర్మ.. 2 వేల మంది పోలీసులను అక్కడికి తరలించారు. తేనెటీగలు కుట్టడం వల్లే యువకుడు చనిపోయినట్టు పోలీసులు తెలిపారు. హింసకు పాల్పడినవారిని గుర్తించేందుకు దర్యాప్తు ముమ్మరం చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని