Annamalai-Tamilisai: అమిత్‌షా ఎఫెక్ట్‌.. తమిళిసైతో అన్నామలై భేటీ

భాజపా సీనియర్‌ నేత తమిళిసైతో తమిళనాడు భాజపా అధ్యక్షుడు అన్నామలై భేటీ అయ్యారు.

Published : 15 Jun 2024 00:10 IST

చెన్నై: తమిళనాడులో లోక్‌సభ ఎన్నికల్లో పేలవ ప్రదర్శన అనంతరం రాష్ట్ర భాజపా వర్గాల్లో తీవ్ర విభేదాలు తలెత్తినట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే, వీటికి తెరదించేందుకు ఆ పార్టీ నేతలు తమిళిసై, అన్నామలైలు ప్రయత్నాలు చేసినట్లు కనిపిస్తోంది. ఇందులో భాగంగా భాజపా సీనియర్‌ నేత, తెలంగాణ మాజీ గవర్నర్‌ తమిళిసైతో భాజపా తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆమెపై ప్రశంసలు కురిపించిన ఆయన.. ఆమె రాజకీయ అనుభవం పార్టీ అభివృద్ధికి దోహదం పడుతుందన్నారు. ఇటీవల ఓ వేదికపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా- తమిళిసై మధ్య సీరియస్‌ చర్చ జరిగిన కొన్ని రోజుల్లోనే ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.

‘‘పార్టీ సీనియర్‌ నేతల్లో ఒకరు, తమిళనాడు భాజపా అధ్యక్షురాలిగా సమర్థవంతంగా పనిచేసిన ‘అక్క తమిళిసై’తో భేటీ కావడం చాలా సంతోషంగా ఉంది. రాష్ట్రంలో కమలం తప్పకుండా వికసిస్తుంది. ఇందుకోసం ఆమె చాలా కష్టపడ్డారు. ఆమె రాజకీయ అనుభవం, సలహాలు పార్టీ అభివృద్ధికి ఎంతో దోహదం చేస్తాయి’’ అని అన్నామలై ట్వీట్‌ చేశారు. అటు తమిళిసై స్పందిస్తూ.. అన్నామలైతో సమావేశం కావడం సంతోషంగా ఉందన్నారు.

ఇదిలాఉంటే, ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, తెలంగాణ మాజీ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ మధ్య సీరియస్‌గా సాగినట్లు కనిపించిన సన్నివేశంపై తీవ్ర చర్చ జరిగింది. ముఖ్యంగా తమిళనాడులో భాజపా నేతల మధ్య అంతర్గత విభేదాల గురించే వీరు మాట్లాడుకున్నారనే వార్తలు వినిపించాయి. అయితే, ఆ ఊహాగానాలను కొట్టిపారేసిన తమిళిసై.. రాజకీయ, నియోజకవర్గ కార్యక్రమాలను ముమ్మరంగా చేపట్టాలని అమిత్‌ షా సలహా ఇచ్చారని చెప్పారు. ఇది జరిగిన కొన్ని గంటలకే మాజీ గవర్నర్‌తో అన్నామలై భేటీ కావడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని