సరిహద్దు వివాదంపై మరోసారి ఉద్ధవ్‌ వ్యాఖ్యలు

కర్ణాటక, మహారాష్ట్ర మధ్య నెలకొన్న సరిహద్దు వివాదంపై రోజురోజుకూ అగ్గి రాజుకొంటోంది. తాజాగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే కర్ణాటక పరిధిలో ఉన్న మరాఠీ మాట్లాడే ప్రాంతాల విషయంలో మరోసారి కీలక వ్యాఖ్యలు......

Updated : 15 Oct 2022 16:49 IST

ముంబయి: కర్ణాటక, మహారాష్ట్ర మధ్య నెలకొన్న సరిహద్దు వివాదంపై రోజురోజుకూ అగ్గి రాజుకొంటోంది. తాజాగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే కర్ణాటక పరిధిలో ఉన్న మరాఠీ మాట్లాడే ప్రాంతాల విషయంలో మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు ఆ ప్రాంతాలను కేంద్రపాలిత ప్రాంతంగా (యూటీ) ప్రకటించాలని డిమాండ్‌ చేశారు.

సరిహద్దు వివాదానికి సంబంధించిన పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా కర్ణాటక ప్రభుత్వంపై ఉద్ధవ్‌ విమర్శలు గుప్పించారు. సరిహద్దులో ఉన్న మరాఠీ మాట్లాడే ప్రజలను వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. సరిహద్దు వివాదం సుప్రీంకోర్టు పరిధిలో ఉండగా.. కర్ణాటక ప్రభుత్వం బెల్గాం పేరు మార్చిందని, దాన్ని రెండో రాజధానిగా ప్రకటించి అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తోందన్నారు. ఇది కోర్టు ధిక్కారం కిందకు రాదా?అని ప్రశ్నించారు. కోర్టు తుది తీర్పు వచ్చే వరకు ఈ ప్రాంతాలను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. విజయం కోసం పోరాడాలని ఈ సందర్భంగా పిలుపునిస్తూ ప్రతిజ్ఞ చేశారు. మహా వికాస్‌ అఘాడీ ప్రభుత్వ హయాంలో జరగకపోతే ఇంకెప్పటికీ ఇది జరగదన్నారు. ఇదే కార్యక్రమంలో పాల్గొన్న ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ మాట్లాడుతూ కేసు గెలిచేందుకు న్యాయపరంగా శక్తియుక్తులన్నీ ఉపయోగించాలన్నారు. ముందుండి ఈ ఉద్యమాన్ని ఉద్ధవ్‌ ఠాక్రే నడిపించడం సంతోషంగా ఉందని ప్రశంసించారు.

కర్ణాటక ఆక్రమించిన మరాఠీ ప్రాంతాలను తిరిగి మహారాష్ట్రలో కలపడానికి కట్టుబడి ఉన్నామంటూ ఇటీవల మహారాష్ట్ర సీఎంవో ట్వీట్‌తో ఈ వివాదం మొదలైంది. దీనికి ప్రతిగా కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప మాట్లాడుతూ తాము అంగుళం భూమి కూడా మహారాష్ట్రకు ఇచ్చేది లేదని స్పష్టంచేశారు. బెళగావి, కార్వర్‌, నిప్పని ప్రాంతాల్లో మరాఠీ మాట్లాడేవారు ఎక్కువగా జీవిస్తుంటారు. ఈ ప్రాంతాలను తమవిగా మహారాష్ట్ర వాదిస్తోంది. ప్రస్తుతం ఈ కేసు ఏళ్లుగా సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది.

ఇదీ చదవండి..
మహారాష్ట్రకు అంగుళం భూమి కూడా ఇవ్వం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని